Adani Group Huge Donation To Skill University: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ను కలిసి రూ.100 కోట్ల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు నైపుణ్యాలు :రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించడం కోసం రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ప్రభుత్వం నియమించింది. స్కిల్ యూనివర్సిటీ ద్వారా 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఏటా లక్షమందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్‌యూనివర్సిటీని విస్తరించనున్నారు. బేగరికంచెలో భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో స్కిల్యూవర్సిటీ శిక్షణ ఇస్తుంది.
స్కిల్ యూనివర్సిటీని దేశానికే ఆదర్శం : తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సంస్థలు ఇందులో భాగమై యువతకు ఉపాధి దొరికేలా నైపుణ్యాల కోసం సహాయం చేయాలని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వం తరుపున 150 ఎకరాల భూమితో పాటు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.