Acharya NG Ranga Agricultural University Construction: గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన భవన నిర్మాణం పూర్తి కాలేదు. కానీ అభివృద్ధి విషయంలో మసిపూసి మారేడు కాయ చేయడంలో దిట్టయిన సీఎం జగన్ మాత్రం భవనాన్ని హడావుడిగా ప్రారంభించేసి, పూర్తయినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. యూనివర్సిటీ యంత్రాంగమూ సీఎం (CM YS Jagan Mohan Reddy) మాటకు తలూపక తప్పలేదు.
రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వర్సిటీ ఏర్పాటు కోసం 516 ఎకరాల భూమిని కేటాయించింది. నిర్మాణానికి 15 వందల కోట్లతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపించారు. కేంద్రం తొలి దశలో 135 కోట్లు ఇచ్చింది. ఇందులో 110 కోట్లతో ప్రధాన పరిపాలనా భవనం నిర్మాణం ప్రారంభించారు. జీ+9 విధానంలో రెండు టవర్లు U ఆకారంలో ఉండేలా భవనాన్ని నిర్మించేందుకు 2018 అక్టోబరు 15న పనులు ప్రారంభించారు.
2020 జనవరి 14 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇంజినీరింగ్ పనులు నిలుపుదల, ఆ తర్వాత ఇసుక కొరతతో పనులు పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వర్సిటీ పనులను పరిశీలించి జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మార్చి 6వ తేదీ నాటికి 90 శాతం పనులు మాత్రమే పూర్తి అయినప్పటికీ భవనాన్ని ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్శిటీ ఇంఛార్జి ఉపకులపతి శారదా జయలక్ష్మీ దేవి మాత్రం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.