Acharya Nagarjuna University Students Protest : గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్ధినులు ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగారు. వసతిగృహంలో పెడుతున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థినులు శుక్రవారం రాత్రి నిరసనకు దిగారు. మధ్యాహ్నం భోజనంలో కప్ప రావడంతో విద్యార్ధినులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే రాత్రి భోజనంలో మరోసారి పురుగులు రావడంతో విద్యార్ధినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతిగృహం బయటకు వచ్చి ధర్నా చేశారు.
రిజిస్ట్రార్‌ను చుట్టుముట్టి : ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించకపోవడంతో విద్యార్ధినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతిగృహం బయటకు వచ్చి ధర్నా చేయాలని నిర్ణయించారు. అయితే విద్యార్థినులను బయటకు రానీయకుండా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేశారు. దీంతో విద్యార్దినులు రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా గేట్లు నెట్టుకుంటూ బయటకు వచ్చారు. వీసీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలంను చుట్టుముట్టారు. రోజూ పురుగుల అన్నమే పెడుతున్నారని రిజిస్ట్రార్ వద్ద వాపోయారు. గత మూడు రోజులుగా అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిలు నినాదాలు చేశారు. అనంతరం విద్యార్ధినులతో రిజిస్ట్రార్ మాట్లాడి శనివారంలోపు సమస్యను పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ హామి ఇచ్చారు.
అన్నంలో మట్టి, పురుగులు - నన్నయ వర్సిటీలో విద్యార్థుల ఆకలి కేకలు