EX Mines MD Venkata Reddy Irregularities :జగన్ సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ పెద్దల ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి, అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనులశాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ఏసీబీ అనుమతి తీసుకుంది.
ACB Investigation on Mines Venkata Reddy : గత సర్కార్ హయాంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి సర్కార్ పెద్దల ఆదేశాలకనుగుణంగా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించారన్న ఫిర్యాదులున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 1న ఆయణ్ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ముందస్తు అనుమతి తీసుకున్న ఏసీబీ :ఏ ప్రభుత్వ ఉద్యోగిపైనైనా విచారణ జరపాలంటే సంబంధిత దర్యాప్తు సంస్థ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈ సెక్షన్ కింద సీఎస్ నుంచి అనుమతి పొందారు. ఈ క్రమంలోనే ప్రాథమిక విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీజీ వెంకటరెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నందున పదవీ విరమణ చేయడం సాధ్యం కాదు.