ACB Arrests To GHMC Bill Collector :ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకునే వారిపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటుంది. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే వారిపై నిఘా పెట్టి ఆధారాలతో సహా వారిని అరెస్ట్ చేస్తుంది. ఎవరైనా అధికారులు లంచం తీసుకునేటప్పుడు దొరికితే అంతే సంగతులు. వారికి సంబంధించిన డేటా మొత్తం తీసి వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. లంచాలు తీసుకున్న అధికారి ఆదాయం ఎంత? ఆదాయానికి మించి ఎన్ని ఆస్తులు ఉన్నాయని తెలుసుకొని కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా హైదరాబాాద్లో ఓ బిల్ కలెక్టర్ రూ.45 వేల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడట్టారు.
అనిశాకు చిక్కిన బిల్ కలెక్టర్ :జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్‌దేవుపల్లి వార్డు కార్యాలయంలో సోమవారం బిల్ కలెక్టర్ మధు, అతని అసిస్టెంట్ (ప్రైవేటు ఉద్యోగి) రమేష్ ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు చిక్కారు. మధుబన్ కాలనీలో ప్లాస్టిక్ పరిశ్రమకు సంబంధించిన షెడ్డు నిర్మాణంలో ఉంది. దానికి ఆస్తి పన్ను సవరణ తర్వాత ఐదింతలు పెరుగుతుందని యజమానిని వీరిద్దరూ భయపెట్టారు.
రూ.లక్ష ఇస్తే పన్ను తక్కువ : రూ.లక్ష ఇస్తే ఆస్తి పన్ను తక్కువ చేస్తామని చెప్పారు. దీంతో బాధితుడు అనిశాను ఆశ్రయించాడు. సోమవారం వార్డు కార్యాలయానికి వచ్చి రూ.లక్ష ఇవ్వలేనని, రూ.45 వేలు చెల్లిస్తానని కోరాడు. వారు సరేనంటూ నగదు తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన అనిశా జిల్లా డీసీపీ ఆనంద్ కుమార్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.