A Woman Died Saree Gets Stuck In Bike Wheel In Palnadu District : తన కుమారుడిని చూసేందుకు వచ్చింది ఆ తల్లి. కుమారుడిని చూసి సంతోషంతో మురిసిపోయింది. కుమారుడితో రెండు రోజులు ఉండి బాగోగులు తెలుసుకుంది. త్వరగా డ్యూటీకి వెళ్లాలి లేటవుతుందంటూ బస్సు ఎక్కేందుకు కుమారుడి ద్విచక్ర వాహనంపై కూర్చొని బయలుదేరింది. అదే ఆమె చివరి రోజైంది. దారి మధ్యలో ఆమె చీరకొంగు బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుంది. ప్రమాదానికి గురై క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.
పల్నాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాసరి శ్రీకాంత్ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేసే వారు. ఆయన దురదృష్టవశాత్తు 2009వ సంవత్సరంలో గుండె నొప్పితో మృతి చెందారు. అనంతరం కారుణ్య నియామకం కింద ఆయన భార్య దాసరి సుస్మిత (49)కు ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పించింది. ఆమె పల్నాడు జిల్లా మాచర్లలోని కాసు బ్రహ్మానంద రెడ్డి కళాశాలలో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసేవారు. అక్కడే గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.