Woman Leaves Family For Boyfriend : భర్తకు రూ.లక్షల్లో వేతనం, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఏ లోటు లేని విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఆమె ఓ ట్యాక్సీ డ్రైవర్ మాయమాటలకు ఆకర్షితురాలైంది. కట్ చేస్తే భర్తను, పిల్లలను కూడా కాదని లండన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్టీఐఏ పోలీసులు గోవాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం లండన్ విమాన సర్వీస్‌లో భర్త వద్దకు పంపించడంతో కథ సుఖాంతమైంది.
అసలేం జరిగిందంటే? :పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన జంటకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వారు ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన తల్లి హైదరాబాద్‌లో మృతి చెందగా అస్తికల నిమజ్జనం కోసం ఆమె నగరానికి వచ్చింది. ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని తిరిగాక రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించింది. ట్యాక్సీ డ్రైవర్ శివ ఆమె నంబరును సేవ్ చేసుకుని ఆమెతో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడి మాయమాటలకు వివాహిత ఆకర్షితురాలైంది. సెప్టెంబరు 16న ఆమె భర్త తల్లి మృతి చెందడంతో ఆయన ఒంటరిగా హైదరాబాద్‌కు వచ్చారు.
ప్రియుడి బర్త్ డే కోసం పిల్లలను విడిచిపెట్టి :పిల్లలను విడిచిపెట్టి ఆమె కూడా సెప్టెంబరు 30న ఎవరికీ తెలియకుండా ప్రియుడి బర్త్ డే వేడుకల కోసమని హైదరాబాద్ వచ్చేసింది. అమ్మ ఇంటికి రావడం లేదని పిల్లలు చెప్పడంతో భర్త వెంటనే భార్యకు ఫోన్ చేశాడు. అయినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. దీంతో కంగారుపడి ఆయన లండన్ వెళ్లి ఆరాతీయగా భార్య హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది.