తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమించిన అమ్మాయిని తనకు దక్కకుండా చేస్తున్నారని కక్ష - యువతి తండ్రిపై ప్రేమోన్మాది కాల్పులు - A MAN FIRING AT SAROORNAGAR

ప్రేమించిన అమ్మాయిని దూరం చేస్తున్నారని కక్షగట్టిన యువకుడు - యువతి తండ్రిపై పిస్టల్​తో కాల్పులు

A MAN FIRING AT SAROORNAGAR
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఎయిర్‌ గన్, ఎయిర్‌ పిస్టల్, పెల్లెట్లు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 11:35 AM IST

Firing at Saroor Nagar : ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేశారని కక్షగట్టిన ఒక యువకుడు ఆమె తండ్రిపై పిస్టల్‌తో కాల్పులు జరిపిన ఘటన ఆదివారం సరూర్‌నగర్‌ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. సరూర్‌నగర్‌ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఓ వ్యాపారి (57) నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వ్యాపారి చిన్న కుమార్తె పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచే ఆమె సహ విద్యార్థి, అంబర్‌పేటకు చెందిన గోగికార్‌ బల్వీర్‌ సింగ్​(25) ప్రేమ పేరుతో వేధించేవాడు.

పగతోనే ఇదంతా! : ఇద్దరూ ఒకే కళాశాలలో ఇంజినీరింగ్‌ కోర్సు చదివారు. అప్పుడు కూడా వేధింపులు ఆగలేదు. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఆరు నెలల కిందట బల్వీర్‌ సింగ్​ను హెచ్చరించాడు. అప్పటి నుంచి బల్వీర్‌ ఆ యువతి తండ్రిపై కక్షగట్టాడు. యువతి తండ్రిని చంపేస్తానని స్నేహితులతో చెప్పేవాడు. కొన్నిరోజుల కిందట ఆమె ఇంటికెళ్లి వివాదానికి దిగాడు. చంపేస్తానంటూ ఆమె తండ్రిని బెదిరించాడు. ఈ నేపథ్యంలో కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆమెను ఇటీవల విదేశాలకు పంపించారు. ప్రేమించిన అమ్మాయిని తనకు దక్కకుండా చేస్తున్నారని పగ పెంచుకున్న బల్వీర్‌ సింగ్,​ ఆదివారం ఆ యువతి నివాసానికి వెళ్లాడు.

యువతి తండ్రిపై ఎయిర్‌ పిస్టల్‌తో ఒక రౌండు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి కన్నుపై గాయమైంది. తర్వాత వారి కారు అద్దాలను ధ్వంసం చేసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. క్షతగాత్రుడ్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి తెలిపారు. గాయపడిన వ్యక్తి క్షేమంగానే ఉన్నారని, చికిత్స పొందుతున్నారని వివరించారు. నిందితుడి నుంచి పోలీసులు ఎయిర్‌గన్, ఎయిర్‌ పిస్టల్, వాటికి సంబంధించిన పెల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో షూటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం మొహంజాహి మార్కెట్‌లో కాల్పులకు ఉపయోగించిన సామగ్రిని కొన్నట్లు సమాచారం.

ఓయో రూంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు :ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు ప్రియుడు మాత్రం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్​లోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామంతాపూర్​లోని ప్రగతినగర్​లో ఆదివారం రాత్రి బేగంబజార్​కు చెందిన ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి ఓంకార్ తన ప్రియురాలు సౌమ్యతో కలిసి ఓయో రూంలో అద్దెకు దిగారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ మధ్యరాత్రి ఓంకార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సౌమ్య ఓయో సిబ్బందికి ఈ విషయం చెప్పడంతో వారు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓంకార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సంఘటన స్థలికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు (ETV Bharat)

మీ టార్చర్ వల్లే మా పాప సూసైడ్ చేసుకుంది - బాచుపల్లి కాలేజీపై తల్లిదండ్రుల ఆగ్రహం

గంజాయి ఆరోపణలతో కానిస్టేబుల్ మనస్తాపం - సెల్ఫీ వీడియో తీసి మరీ!

ABOUT THE AUTHOR

...view details