Husband Built Temple in Jagtial District : బతికుండగానే కొందరు భర్తలు భార్యకు నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో, ఆయన మాత్రం ఆదర్శంగా నిలిచాడు. ఇల్లాలే ప్రత్యక్ష దైవమని భావించి, తుదిశ్వాస విడిచిన ఆమె కోసం ఏకంగా గుడినే కట్టించాడు. అంతేకాక సమాధిపై నిత్యం దీపం వెలిగిస్తూ తన ప్రేమను చాటుకుంటున్నాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
Jagtial Man Built Temple for Wife : మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన దుబ్బయ్యకు ముత్యంపేటకు చెందిన బుచ్చమ్మతో చిన్నతనంలోనే వివాహమైంది. వారికి పిల్లలు లేకపోయినప్పటికీ, దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. బతుకుదెరువు కోసం ఆయన దుబాయ్ వెళ్లి వచ్చి ఇంటి వద్దే స్థిరపడ్డాడు. 30 ఏళ్ల పాటు భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే గత ఏడాది క్రితం బుచ్చమ్మ అస్వస్థతకు గురై మరణించింది.
ఈ క్రమంలోనే బుచ్చమ్మ మరణాన్ని దుబ్బయ్య జీర్ణించుకోలేకపోయాడు. ఆమెకు గుడికట్టాలని నిర్ణయించుకొని తన మామిడితోటలోనే ప్రత్యేకంగా గదులను నిర్మించాడు. ఇందుకోసం రూ.15 లక్షలు వెచ్చించాడు. అలాగే నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ.లక్ష వ్యయంతో సోలార్ పవర్ ఏర్పాటు చేశాడు. ప్రత్యేకంగా నిర్మించిన గదిలో సమాధిని ఏర్పాటు చేసి అందమైన రంగుల దీపాలతో అలంకరించాడు. మరో గది నిండా ఆమె చిత్రాలు ఏర్పాటు చేశాడు.
పవిత్రమైన అనుబంధానికి నిదర్శనం : ప్రతిరోజు గుడికి వచ్చి సమాధిపై దీపం వెలిగించి భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నట్లు భర్త దుబయ్య తెలిపారు. ఆమెతో గడిపిన సమయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. దుబ్బయ్యకు భార్య మీద ఉన్న ఆరాధనాభావం చూసి అందరూ ఆయణ్ను అభినందనలతో ముంచేస్తున్నారు. దంపతుల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధానికి ఆయన చూపిస్తున్న అభిమానమే నిదర్శనమని స్థానికులు అంటున్నారు.