National Games 2025 in Kerala :వృద్ధులంటే ఎవరిపైనో ఒకరిపై ఆధారపడి జీవించాల్సిందే అనుకుంటారు. వారి శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిల్లి, నిలబడలేక, కూర్చోలేక ఏ వస్తువునూ పట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. కానీ కొందరు తమ ప్రతిభకు వయస్సు అడ్డుకాదని నిరూపిస్తుంటారు. సాధించాలనే పట్టుదల, నిబద్ధతే దానికి కారణం. తాజాగా ఆ బామ్మ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు కేరళకు వెళ్లింది. కానీ తీరా అక్కడికి వెళ్లాకు కుమారుడికి గుండెపోటని సమాచారం వచ్చింది.
ఈ పరిస్థితుల్లో ఎవరైనా వెనక్కు వచ్చేస్తారు. కానీ ఆ బామ్మ మాత్రం ఆ బాధను దిగమింగుకుని పోటీదారులతో హోరాహోరీగా తలపడి పతకాలు సాధించింది. ఎనిమిది పదుల వయస్సులోనూ పోటీపడి గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విజయంతో ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం శివారు అంకుపాలెంకు చెందిన ముత్యం లక్ష్మి (86) గత నెలలో అనకాపల్లి, గుంటూరులో జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్-2025 పోటీల్లో రాణించారు.
Anakapalli Old Woman Won Medals : దీంతో ఆమె జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన ఆ పోటీల్లో పాల్గొనేందుకు స్థానికుల ఆర్థిక సాయంతో గత నెల 29న కేరళ బయల్దేరి వెళ్లారు. పోటీలు ప్రారంభమైన రోజే లక్ష్మి రెండో కుమారుడు గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు. కుటుంబసభ్యులు ఈ విషయం తల్లికి చెప్పి తిరిగొచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేస్తామని చెప్పారు. ఈ వయసులో విమాన ప్రయాణం వద్దని వైద్యులు సూచించడంతో ఆమె విరమించుకున్నారు.