6th World Telugu Writers Meeting On 2nd Day : విజయవాడ నగరంలోని కేబీఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు రెండో రోజు సందడిగా ప్రారంభమయ్యాయి. వేదికపై 'తెలుగులో న్యాయపాలనపై సదస్సు' జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథరావు, జస్టిస్ బి.కృష్ణమోహనరావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ నగేశ్ భీమపాక హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభల్లో "తెలుగులో న్యాయపాలన సదస్సు"పై న్యాయమూర్తులు వారి అభిప్రాయాల్ని వెల్లడించారు. కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థమయ్యేలా ఉండాలని , తీర్పులు సవివరంగా తెలుగులో వెలువరించాలని ఏపీ- తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ఆకాంక్షించారు. తీర్పులు అందరికీ అర్థమైతే పారదర్శకత పెరుగుతుందని అన్నారు. ప్రజల భాషలో న్యాయపాలన జరగాలని ముక్తకంఠంతో నినదించారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన జస్టిస్ వెంకటశేషసాయి కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాలన్నారు. కొందరు న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు.
కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు : జస్టిస్ ఎన్.వి. రమణ
తీర్పు తెలుగులో ఉంటే మరింత పారదర్శకత ఉంటుందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అభిప్రాయపడ్డారు. తెలుగులో తీర్పులు ఇస్తే అప్పీళ్లకు వెళ్లడం తగ్గుతుందని భావిస్తున్నానన్నారు. అమ్మభాష పరిరక్షణకు ఏం చేయాలనేది అందరూ ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని అనుభవించాలని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ అన్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు మన కవులు, వాగ్గేయకారుల గురించి తెలియజెప్పాలన్నారు.