39th Day of Agitation by Anganwadis Across The State : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనలు 39 రోజూ కొనసాగాయి. విజయవాడ ధర్నాచౌక్ వద్ద మూడో రోజు అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. నిరాహార దీక్షలో కూర్చున్న వారికి వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు చేశారు. అంగన్వాడీల దీక్షకు వివిధ కార్మిక, రైతు, మహిళా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల డిమాండ్లు న్యాయమైనవని వాటిని తక్షణం నెరవేర్చకపోతే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని నేతలు హెచ్చరించారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు. అన్న క్యాంటీన్ ద్వారా అంగన్వాడీలకు. భోజనం అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి CDPO కార్యాలయం వద్ద ప్రభుత్వం ఇచ్చిన నోటీసులతో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని దీక్షా శిబిరంలో లంచ్ బాక్సులను 39 ఆకారంలో పెట్టి ఆందోళన చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంగన్వాడీలు తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విగ్రహం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్‌ని గెలిపించి. తప్పు చేశామంటూ కర్నూలులో అంగన్వాడీలు లెంపలు వేసుకుంటూ నిరసన తెలిపారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి.. నిరసన తెలిపారు. YSR జిల్లా మైదుకూరులో అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని, చెతిలో చిప్ప పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిరసనకు వెళ్తూ అంగన్వాడీ కార్యకర్త శాంతకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఉద్యోగం తీసేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఒత్తిడికి లోనే శాంతికుమారి చనిపోయారని తోటి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు... శాంతికుమారి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
విశాఖలో అంగన్వాడీలు డాబా గార్డెన్స్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలో ధర్నా చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.