Vijayawada Book Fair 2025 :విజయవాడ ఇందిరాగాంధీ మైదానం వేదికగా 35వ పుస్తక మహోత్సవం జనవరి 2వ తేదీ (గురువారం) సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది.ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 234 స్టాళ్లతో అనేకమంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. సాహితీ నవజీవన్ బుక్ లింక్స్ అధినేత పిడికిలి రామకోటేశ్వరరావు పేరును ఈ పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పెట్టారు. ప్రధాన సాహితీవేదికకు ఈనాడు వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు పేరు పెట్టారు. విద్యార్థుల కార్యక్రమాలు జరిగే ప్రతిభా వేదికకు ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాపేరు పెట్టారు. ఈ పుస్తక మహోత్సవం 2వ తేదీనుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి.
అతిపెద్ద పుస్తక పండగ :విజయవాడలో పుస్తక మహోత్సవానికి వేళయ్యింది. ఈ పుస్తక మహోత్సవం మూడున్నర దశాబ్దాల మైలురాయిని ఘనంగా దాటనుంది. ఏటా సంక్రాంతికి ముందు జరిగే అతిపెద్ద పండగ పుస్తక మహోత్సవమే. ఈ ఏడాది 35వ పుస్తక మహోత్సవానికి పెద్దఎత్తున సన్నాహాలు చేశారు. దీనికి నగరం మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వేదిక కావడంతో నిర్వాహకులు, పుస్తక ప్రియుల్లోనూ నూతనోత్సాహం సంతరించుకుంది. ఇప్పటికే 234కు పైగా ప్రచురణ సంస్థలు స్టాళ్ల ఏర్పాటుకు పేర్లు నమోదు చేసుకున్నారు.
జనవరి 2 నుంచి 12 వరకూ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఈ పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.