ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాడిద పాలతో ఘరానా మోసం - లబోదిబోమంటున్న రైతులు - DONKEY MILK SCAM

గాడిద పాల ఉత్పత్తి - లాభాల పేరుతో ఆశ చూపి కోట్లలో మోసం

donkey_milk_scam
donkey_milk_scam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 5:10 PM IST

Updated : Nov 15, 2024, 8:02 PM IST

100 Crore Scam in Donkey Milk Business in 4 States : ఇటీవల ఎక్కడ చూసినా గాడిద పాల గురించి విస్తృత చర్చ సాగుతుంది. మార్కెట్లో దీనికున్న హైప్‌, డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని తమిళనాడుకు చెందిన ఓ ముఠా గాడిద పాల ఉత్పత్తి, లాభాల పేరుతో ఆశ చూపి ఔత్సాహిక రైతులను నమ్మించి మోసం చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో గాడిదపాల కుంభకోణం వెలుగు చూసింది.

ఓ సంస్థ ఫ్రాంచైజీ పద్దతిలో గాడిద పాలు తీసుకొని దాదాపు రూ.100 కోట్ల వరకు ఎగవేసిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత రైతులు తమ గోడు వెలిబుచ్చారు. చైన్నైలోని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులు తమను నమ్మించి నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొవిడ్‌ నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్‌ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో అవి చూసి వారిని సంప్రదించామని బాధితులు తెలిపారు. డాంకీ ప్యాలెస్‌ మిస్టర్‌ బాబు ఉలగనాథన్‌ ఆధ్వర్యంలో గిరి సుందర్‌, బాలాజీ, సోనికరెడ్డి, డాక్టర్‌ రమేశ్‌ బృందం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఒక్క రైతు వద్ద రూ.5లక్షలు తీసుకున్నారు.

మీ పిల్లలకు గాడిద పాలు తాగిస్తున్నారా? - లేదంటే చాలా కోల్పోతున్నట్టే!

ఒక్కో పాడి గాడిదను రూ.80వేల నుంచి రూ.1.50లక్షల చొప్పున విక్రయించారు. ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు రూ.1600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారు. కానీ గత 18 నెలలుగా డాంకీ ప్యాలెస్‌కు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్‌ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదని బాధితులు వివరించారు.

నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తే ఒక్కొక్కరికీ రూ.15 లక్షల నుంచి రూ.70లక్షల వరకు బ్యాంకు చెక్కులు రాసిచ్చారని వారు తెలిపారు. వాటిని బ్యాంకులో వేస్తే బౌన్స్‌ అయ్యాయని, మోసపోయామని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు తమలాగా రూ.100 కోట్ల వరకు నష్టపోయారని వారు తెలుపుతున్నారు. ఇదో పెద్ద కుంభకోణమని దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చు అనుమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై చెన్నై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితులు వివరించారు. ఒప్పందం సందర్భంగా ఇచ్చిన జీఎస్‌టీ సంఖ్య, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్‌ కూడా నకిలీవేనని తేలిందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యం అని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

గాడిద పాలు 5 మిల్లీలీటర్లు @ 100 రూపాయలు.. ఎగబడుతున్న జనం

Last Updated : Nov 15, 2024, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details