Women T20 World Cup 2024 : టీ 20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా విజయం సాధించడంతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మాయిల వంతు వచ్చింది. వారు ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడేందుకు రంగం సిద్ధమైపోయింది.
మహిళల టీ 20 వరల్డ్ కప్ గురువారమే(అక్టోబర్ 3) గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. అసలే గత కొంత కాలంగా మహిళల క్రికెట్ పంజుకుని, ఆకర్షణీయంగా మారింది. క్రికెట్ అభిమానుల దృష్టిని కూడా బాగానే ఆకర్షిస్తోంది. టీ 20ల్లో వారు ఆడే స్టేడియాలు కూడా నిండిపోతున్నాయి. టీవీ సెట్ల ముందు కూడా పర్వాలేదనిపించే సందడి కనిపిస్తోంది.
దీంతో యూఈఏ వేదికగా గురువారం ప్రారంభం కానున్న టీ20 పొట్టి కప్పుపై కూడా అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఫార్మాట్లోనూ భారత మహిళల జట్టు ప్రపంచ కప్ సాధించలేకపోయింది. కానీ ఈ సారి ఎలాగైనా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది.
2020లో మొదటి సారి టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది భారత్. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. తమ దేశ పురుషుల జట్టును కన్నా క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఆసీస్ మహిళల జట్టు ఇప్పటివరకు ఆరు సార్లు విశ్వ విజేతగా నిలిచింది. అందుకే ఈ సారి కూడా ఆ జట్టు ఫేవరెట్‌గానే బరిలోకి దిగనుంది.