T20 world cup 2024 Teamindia Squad :సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే అని చాలామంది సిద్ధాంతం. రెండేళ్ల క్రితం వరకు బీసీసీఐ ప్రణాళిక ఇలానే కొనసాగించింది. కానీ 2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్‌ఇండియా ఘోర ఓటమి పొందడం వల్ల స్టార్ ప్లయేర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను పొట్టి ఫార్మాట్లో కాస్త పక్కనబెట్టింది. ఇక టీ20 కప్పులో వీరిని చూడటం కష్టమేనని అంతా అనుకున్నారు! హార్దిక్ పాండ్య నాయకత్వంలో టీమ్ ఇండియా బరిలో దిగుతుందని అంతా భావించారు. కానీ రెండేళ్లు కూడా అవ్వలేదు అంతా తారుమారైంది. ఇప్పుడు కోహ్లీ, రోహితే జట్టులో మళ్లీ ప్రధాన ఆటగాళ్లైపోయారు. ఏడాది నుంచి టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్యకు చివరికి జట్టులో చోటు కూడా కష్టమే అన్న పరిస్థితి నుంచి త్రుటిలో బయటపడ్డాడు! ఫైనల్‌గా బీసీసీఐ సెలక్టర్ల అనుభవానికే ఓటేశారు.
2022 టీ20 వరల్డ్ కప్‌లో నిలిచిన జట్టులోని ఎనిమిది మందికి మరోసారి ప్రపంచకప్ ఆడే ఛాన్స్ దక్కింది. కోహ్లీ, రోహిత్, హార్దిక్, రిషబ్ పంత్, సూర్యకుమార్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, చాహల్ తమ స్థానాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం సెలెక్ట్ అయిన వారిలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగితా వారు ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే విషయం.
ఆ ఇద్దరు జట్టుకు బలం -ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ ఫామ్‌లో ఉండటం జట్టుకు బలాన్ని ఇచ్చే అంశం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 158.29 స్ట్రెక్‌రేట్‌తో 315 పరుగులు సాధించాడు. కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 147.49 స్ట్రైక్‌రేట్‌తో 500 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. వెస్టిండీస్, అమెరికాలోని మందకొడి పిచ్‌లపై ఈ ఇద్దరి ఆట కీలకం. ఇక 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఈ వరల్డ్ కప్‌నకు సెలక్ట్ అవ్వడం సంచలనమే అని చెప్పాలి. సుమారు 15 నెలలు ఆటకు దూరమైనా. అతడు. ఐపీఎల్‌లో తన ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటను మలుపు తిప్పగలడుతడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అతడు 11 మ్యాచుల్లో 158.56 స్ట్రైక్‌రేట్‌తో 398 పరుగులు చేశాడు. సంజు శాంసన్ కూడా సెలెక్టర్లు తనను ఎంపిక చేయాల్సిన విధంగా ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, నిలకడగా రాణిస్తున్నప్పటికీ భారత జట్టుకొచ్చేసరికి రకరకాల కారణాలతో సంజును పక్కనపెట్టేవారు. కానీ చివరికి అతడి మౌన పోరాటమే చివరికి జట్టులో చోటు దక్కేలా చేసింది. ఈ సీజన్‌లో అతడు 161.08 స్ట్రైక్‌రేట్‌తో 385 పరుగులు సాధించాడు.