PM Modi Meet Chess Champions :హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషులు, మహిళల జట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో బుధవారం కలిశారు. వైశాలి, హారిక, తానియా సచ్ దేవ్, విదిత్, అర్జున్ ఇరిగేశి, ప్రజ్ఞానంద, దివ్య దేశ్ ముఖ్, వంటికా అగర్వాల్ సహా క్రీడాకారులతో ప్రధాని మోదీ మమేకమయ్యారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ప్రధాని మోదీకి చెస్ బోర్డును బహూకరించారు.
క్రీడాకారులకు ప్రధాని ప్రశ్నలు
చెస్ గోల్డ్ మెడలిస్ట్‌లకు ప్రధాని మోదీ పలు ప్రశ్నలను సంధించారు. అలాగే క్రీడాకారుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. బుడాపెస్ట్ చెస్ ఒలింపియాడ్ ఫైనల్లో ఏకపక్షంగా రాణించినప్పుడు మీ ప్రత్యర్థులు ఎలా స్పందించారని మహిళా క్రీడాకారులను మోదీ ప్రశ్నించారు. తమ ప్రదర్శన పట్ల ప్రత్యర్థులు సంతోషం వ్యక్తం చేశారని హారిక బదులిచ్చారు. చెస్ పై ఏఐ (Artificial Intelligence) ప్రభావంపై ప్రధాని మోదీ మరో ప్రశ్నను అడగ్గా, అందుకు మరో యువ క్రీడాకారుడు ప్రజ్ఞానంద సమాధానం ఇచ్చాడు. ఏఐతో చదరంగం అభివృద్ధి చెందిందని, కొత్త ఆలోచనలను చూపుతోందని వివరించారు.
బర్త్ డే గుర్తు చేసిన మోదీ
చెస్ క్రీడాకారిణి వంటికా అగర్వాల్ పుట్టినరోజు శనివారం అని ప్రధాని గుర్తు చేయడం వల్ల ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ తన బర్త్ డే గుర్తుంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వంటికా చెప్పుకొచ్చారు. గుజరాత్లో జరిగిన ఒక జూనియర్ చెస్ పోటీల్లో ప్రధాని చేతుల మీదుగా 9 ఏళ్ల వయసులో పతకాన్ని అందుకున్నానని గుర్తు చేసుకున్నారు.