PARIS OLYMPICS 2024 NEERAJ CHOPRA SILVER MEDAL :ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ చివరి దశకు చేరుకుంటోంది. అయినా భారత్ ఇప్పటివరకు కేవలం నాలుగు కాంస్యాలు మాత్రమే గెలుచుకుంది. అంచనాలు ఉన్న పలువురు అథ్లెట్లు పతకం సాధించకుండానే నిష్క్రమించారు. మరి కొందరు పతకానికి చేరువగా వెళ్లి డీలా పడ్డారు. ఇలాంటి స్థితిలో అందరి చూపు బల్లెం వీరుడు నీరజ్ చోప్రాపై పడింది. అప్పటికే టోక్యోలో పసిడి ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించిన అతడు మరోసారి అదే పతకాన్ని సాధించాలని అంతా ఆశించారు. అందుకు తగ్గట్టే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ సహా మేటి క్రీడాకారులను వెనక్కి నెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. 89.45 మీటర్ల దూరం బల్లేన్ని విసిరాడు. కానీ అనూహ్యంగా పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను(92.97 మీటర్లు) మాత్రం దాటలేకపోయాడు. దీంతో స్వర్ణాన్ని అర్షద్ ఎగరేసుకుపోగా, నీరజ్ రజతాన్ని గెలుచుకున్నాడు. అయినప్పటికీ నీరజ్ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, రజతం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డుకెక్కాడు.
పక్క దారి పట్టలేదు - ఓ విజయం తర్వాత వచ్చే పేరు ప్రఖ్యాతలను ఎలా తీసుకున్నారనే దానిపైనే ఓ అథ్లెట్ కెరీర్ ఆధారపడి ఉంటుంది. స్వర్ణ విజయం దక్కిన తర్వాత కూడా నీరజ్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవడంపైనే పూర్తి దృష్టి పెట్టాడు. నిరంతర సాధనలో మునిగిపోయాడు. జర్మనీ కోచ్ క్లాస్ బార్టోనిజ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటూ మరింత వృద్ధి సాధించాడు. ఇంతవరకు మరే భారత అథ్లెట్ సాధించని ఘనతలను అందుకున్నాడు. 90 మీటర్లు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగిన అతడు 2022 డైమండ్ లీగ్‌లోని పోటీల్లో 89.94మీ.తో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 2022లో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. ఈ ఘనత అందుకున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు. డైమండ్ లీగ్‌లో 2022లో గోల్డ్ మెడల్‌తో రికార్డు నమోదు చేశాడు. అంతకుముందు రజతం అందుకున్నాడు. ఆసియా క్రీడల్లోనూ గోల్డ్ మెడల్ సాధించాడు. 2023 మేలో ప్రపంచ నంబర్‌వన్‌గానూ నిలిచాడు.