తెలంగాణ

telangana

ETV Bharat / sports

పారాలింపిక్స్​లో ముగిసిన పతకాల వేట - 29 మెడల్స్​తో భారత్​ నయా రికార్డు - Paralympics 2024 Medal Winners

Paralympics 2024 Medal Winners : పారిస్​ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన పారాలింపిక్స్​ తాజాగా ముగిసింది. అయితే ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు ఎన్ని పతకాలు సాధించారంటే?

Paralympics 2024
Paralympics 2024 (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 9, 2024, 7:56 AM IST

Paralympics 2024 Medal Winners :గత 12 రోజులుగా అభిమానులను అలరించి ఎందరికో స్ఫూర్తినింపిన పారిస్‌ పారాలింపిక్స్‌కు నిన్న (సెప్టెంబర్ 7) తెరపడింది. టోక్యో క్రీడల లాగే ఈసారి కూడా చైనా (220) అత్యధిక పతకాలు సొంతం చేసుకుని ముందంజలో ఉంది. 94 స్వర్ణాలతో టాప్​లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 124 పతకాలతో బ్రిటన్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇందులో 49 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇక అమెరికా ఈ సారి 36 స్వర్ణాలు సహా 105 పతకాలు సాధించగా, పారాలింపిక్స్‌ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్‌ 29 పతకాలకో 18వ స్థానంతో పోటీలను ముగించింది.

పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటిదాకా మొత్తం 60 పతకాలు గెలిస్తే.. అందులో ఈ ఒక్క క్రీడల్లోనే దాదాపు సగం పతకాలు వచ్చాయి. గత రెండు పారాలింపిక్స్‌లో (29 + 19) భారత్‌ 48 పతకాలు నెగ్గడం విశేషం. 1968 నుంచి పోటీపడుతున్న భారత్‌ 2016 వరకు కేవలం 12 పతకాలే నెగ్గింది.

దిల్లీ పిల్ల అదుర్స్
స్వల్ప అంధత్వ అథ్లెట్లు పోటీపడే విభాగంలో పోటీపడ్డ దిల్లీ అమ్మాయి సిమ్రన్‌ శర్మ కాంస్య పతకాన్ని సాధించింది. 200 మీటర్ల, టీ12 విభాగంలో ఆమె 24.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే 100 మీటర్ల పరుగులో పాల్గొని నాలుగో స్థానంలో సరిపెట్టుకున్న సిమ్రన్‌, ఈసారి పట్టుదలతో పోరాడి విజయం సాధించింది.

గతంలోనూ ఈమె స్థిరంగా రాణించింది. హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో రజత పతకాలతో సత్తా చాటింది. గతేడాది డిసెంబర్‌లో ఖేలో ఇండియా పారా క్రీడల్లో సిమ్రన్‌ 100, 200 మీటర్ల పరుగుతో పాటు లాంగ్‌ జంప్‌లోనూ స్వర్ణాలు నెగ్గింది. భర్త గజేంద్ర సింగే ఆమెకు కోచ్‌.

ఆ ఇద్దరిదీ ఒకే ఊరు
హరియాణాలోని పానిపట్​కు చెందిన జావెలిన్ త్రో ప్లేయర్ నవ్‌దీవ్‌ సింగ్​ చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. 4 అడుగుల 4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్నందున అతడ్ని అందరూ హేళన చేసేవారు. అయితే అతడు మాత్రం చదువుల్లో బాగా రాణించాడు. నాన్న దల్వీర్‌సింగ్‌ సపోర్ట్​తో ఆటల్లోనూ ప్రవేశించి సత్తాచాటాడు. తొలుత రెజ్లింగ్, అథ్లెటిక్స్‌లో పతకాలు కొల్లగొట్టాడు. 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతులు మీదుగా 'రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌'ని కూడా అందుకున్నాడు.

ఇక తన ఊరికి (పానిపట్​)కు చెందిన ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రాను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని జావెలిన్‌త్రో లోకి ఎంట్రీ ఇచ్చాడు. నీరజ్​లాగే తానూ ప్రపంచ వేదికపై పతకం గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగాడు. ఓ వైపు ఆదాయపు పన్ను విభాగంలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు 2017 నుంచి అన్నీ పోటీల్లో పాల్గొన్నాడు. తొలి ప్రయత్నంలోనే ఆసియా పారా యూత్‌ క్రీడల్లో పసిడి పతకాన్ని ముద్దాడాడు. ఆపై ఇప్పటికి అయిదుసార్లు పారా క్రీడల్లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు.

ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆరంభంలో కోబె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2020 టోక్యో పారాలింపిక్స్, 2022 పారా ఆసియా క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి నిరాశపడిప్పటికీ, ఈ సారి మాత్రం ఏకంగా స్వర్ణమే గెలిచాడు.

"సాధారణ అథ్లెట్లలాగే మాదిరే మాకు గౌరవం దక్కాలి. ఈ ప్రపంచంలో మేమూ బతుకుతున్నాం అని అందరూ గుర్తించాలి. మమ్మల్ని ఎవరూ హేళన చేయకూడదు. దేశం గర్వించేలా చేసే సత్తా పారాఅథ్లెట్లకు ఉంది. ఈ స్థితికి రావడానికి నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. మానసిక స్థైరాన్ని పెంచుకుని మెరుగైన ఫలితాలు సాధించడంపైనే నా దృష్టి సారించాను. స్వర్ణం గెలవడం నాకు ఎంతో గొప్పగా అనిపిస్తోంది" అని నవ్‌దీప్‌ చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details