Neeraj Chopra Diamond League :2024 డైమంగ్ లీగ్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రన్నరప్‌గా నిలిచాడు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ పోటీలో పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా) తొలి స్థానం కైవసం చేసుకున్నాడు. అయితే ఈ పోటీలో తాను చేతి గాయంతోనే బరిలోకి దిగానని నీరజ్ చోప్రా చెప్పాడు. ఈ మేరకు చేతి ఎక్స్ రే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంట్లో ఎడమ చేతి ఉంగరపు వేలిపై పగులు ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఏడాది ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఎన్నో అనుభవ పాఠాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.
'2024 సీజన్ ముగిసింది. ఈ సంవత్సరంలో నేను ఎంతో నేర్చుకున్నా. ఆటపరంగానే కాకుండా మానసికంగానూ మెరుగయ్యాను. అయితే డైమంగ్ లీగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో సోమవారం చేతికి గాయమైంది. ఎక్స్ రే తీయిస్తే ఎడమచేతి ఉంగరపు వేలు విరిగినట్లు తెలిసింది. ఈ ఏడాదిలో ఇదే చివరి పోటి. ఇందులో అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ ఎంతో నేర్చుకున్నాను. 2024 నాకు మంచి అథ్లెట్‌గా పేరునిచ్చింది. నాకు మద్దతుగా ఉండి నన్ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు. పూర్తిగా కోలుకుని పూర్తి ఫిట్‌గా తిరిగి రావాలనుకుంటున్నాను. మళ్లీ 2025లో కలుద్దాం' అని నీరజ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
0.1 సెంటీమీటర్తోనే
అయితే ఈ పోటీలో నీరజ్ 0.1 సెంటీమీటర్ తేడాతో తొలి స్థానం కోల్పోయాడు. అతడు అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం ఈటె విసిరాడు. ఇక తన మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నీరజ్ ఆఖరి ప్రయత్నంలో 86.46 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. పీటర్స్ అండర్సన్ 87.87 మీటర్లతో ఛాంపియన్‌గా నిలిచాడు.