Mumbai Indians RTM Player : 2024 ఐపీఎల్‌లో చాలా మంది యంగ్ ప్లేయర్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీమ్‌ఇండియా ఛాన్స్‌లు కూడా కొట్టేశారు. అయితే ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఓ యంగ్ ప్లేయర్ మాత్రం మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ అతడి సామర్థ్యం అతడికి అద్భుతమైన అవకాశం తీసుకొచ్చింది. 2025 ఐపీఎల్ మెగా వేలంలో ముంబయి ఇండియన్స్ అతడిని ఏకంగా రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించి మరీ నమన్‌ను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఇంతకీ అతడు ఎవరంటే?
ఆ నాలుగు ఫ్రాంచైజీల ఇంట్రెస్ట్!
ఐపీఎల్ వేలంలో చాలా ఫ్రాంచైజీలు నమన్ ధీర్ కోసం పోటీ పడ్డాయి. దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసక్తి చూపాయి. అయితే ముంబయి జట్టు సమయానుకూలంగా ముందుకు సాగింది. అతడిని తిరిగి సొంతం చేసుకుంది. 2024 ఐపీఎల్ సీజన్‌లో నమన్ ముంబయి తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 140 పరుగులు చేశాడు, ఇందులో హైయస్ట్ స్కోర్ 62.
కెనడా డ్రీమ్స్ నుంచి క్రికెట్ స్టార్‌డమ్ వరకు
కేవలం రెండేళ్ల క్రితమే నమన్ క్రికెట్‌ను వదిలేసే ఆలోచనలో ఉన్నాడంటే నమ్మడం కష్టం. అతడు కెనడాలోని ఎడ్మోంటన్‌లో ఉన్న తన సోదరి దగ్గరకు వెళ్లి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఇటీవల నమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'పంజాబ్‌లో సగం మంది కెనడాకు వెళ్లాలనుకుంటున్నారు. నేను వారిలో ఒకడిని' అని చెప్పాడు. వాస్తవానికి స్టార్ పేసర్ బుమ్రా కూడా ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ కాకపోయి ఉంటే కెనడా వెళ్లేవాడినని చెప్పాడు. అయితే క్రికెట్‌కు మరో ఏడాది సమయం ఇవ్వాలని నమన్ తండ్రి నరేశ్ సూచించారు. ఆ నిర్ణయంతో అంతా మారిపోయింది. నమన్ 2022 డిసెంబర్‌లో రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. 2023 నాటికి ముంబయి గూటికి చేరాడు.