RCB Name Change:ఐపీఎల్లో ప్రముఖ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్ 17కు ముందు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2024 నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు పేరులో చిన్న మార్పు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టితో ఉన్న వీడియో ఒకటి ట్విట్టర్లో షేర్ చేసింది.'రిషభ్ శెట్టి ఏం చెప్పాలనుకుంటున్నాడో మీకు అర్థమైందా? మార్చి 19న ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్లో తెలుస్తుంది' అని పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది.
వీడియోలో హీరో రిషభ్ శెట్టి తెలుపు రంగు చొక్కా, లుంగీ ధరించి మూడు దున్నలను తీసుకొస్తున్నారు. అందులో దున్నలకు వరుసగా 'Royal', 'Challanegers', 'Bangalore' అని రాసి ఉంది. అందులో నుంచి 'Bangalore' అని రాసి ఉన్న దున్నను తీసుకెళ్లండి అని పక్కన ఉన్న వ్యక్తితో చెప్తారు. దీంతో ఆర్సీబీ పేరులో మార్పు ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అయితే క్రికెట్ తప్పా ఇతర ఆటల్లో బెంగళూరును ఇంగ్లీష్‌లో 'Bangalore' అని కాకుండా 'Bengaluru' గా రాస్తున్నారు. దీంతో స్థానిక ఫ్యాన్స్ తమ జట్టు పేరులో స్పెల్లింగ్ మార్చాలని కోరారట. ఈ నేపథ్యంలోనే ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ కూడా ఫ్యాన్స్ కోరిక మేరకు పేరులో మార్పు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మార్చి 19న 'ఆర్సీబీ అన్‌బాక్స్' (RCB Unbox) ఈవెంట్లో దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. మరి మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే.