Longest Test Match:ప్రస్తుతం ధనాధన్ టీ20 ఫార్మాట్ ట్రెండ్ నడుస్తోంది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లకు ఆదరణ తగ్గిపోయింది. వన్డేలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు తక్కువ సమయంలోనే అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు 'టైమ్‌లెస్ టెస్ట్' మ్యాచ్‌లు జరిగాయని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉందా? 1939లో క్రికెట్ చరిత్రలోనే 'లాంగెస్ట్ టెస్ట్' మ్యాచ్ జరిగింది. దాదాపు 9రోజులపాటు సాగిన ఆ ఆటలో ఫలితం కూడా తేలలేదు. మరి ఆ మ్యాచ్ విశేషాలు మీకోసం.
లాంగెస్ట్ టెస్ట్ మ్యాచ్
డర్బన్‌లో ఇంగ్లాండ్- సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో అత్యంత సుదీర్ఘమైన ఆటగా రికార్డులకెక్కింది. గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇదే చివరి 'టైమ్‌లెస్ టెస్ట్' మ్యాచ్. అంటే సమయానికి ఎటువంటి పరిమితి లేదు. ఫలితం వచ్చే వరకు మ్యాచ్ ఆడాల్సిందే. అయితే ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా టైమ్‌లెస్ టెస్ట్‌ని తొమ్మిది రోజుల తర్వాత రద్దు చేశారు. వర్షం అంతరాయం కలిగించడం, ఇంగ్లాండ్ జట్టు ప్రయాణించాల్సిన ఓడ సౌతాఫ్రికా నుంచి బయలుదేరాల్సిన సమయం రావడం వల్ల మ్యాచ్ రద్దైంది.
ఈ మ్యాచ్ 1939 మార్చి 3 నుంచి 14 వరకు 12 రోజుల పాటు జరిగింది. ఇందులో రెండు విశ్రాంతి రోజులు (మార్చి 5, 12) ఉన్నాయి. ఒక రోజు (మార్చి 11) మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. 43 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 1,981 పరుగులు నమోదయ్యాయి. బౌలర్లు 5,447 బంతులు సంధించారు.