Jasprit Bumrah Border Gavaskar Trophy :బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి (నవంబరు 22) నుంచి ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్టు ఆడనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీతో కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్సీ, భారత జట్టుపై విలేకరుల సమావేశంలో బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియాను తేలికగా తీసుకోవద్దని ఆసీస్‌ను హెచ్చరించాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్ గురించి బుమ్రా ఏమన్నాడంటే?
అయితే ఇటీవలె న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఓటమి ప్రభావం బోర్డర్ గావస్కర్ ట్రోఫీపై ఏమాత్రం ఉండదని బుమ్రా అన్నాడు. "మీరు ఒక సిరీస్ గెలిచినా కూడా తర్వాత సిరీస్‌లో మొదటి నుంచి మొదలుపెట్టాల్సిందే. ఓడినా కూడా తిరిగి మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. భారత్‌లో ఓటమి తాలుకా నిరుత్సాహాన్ని నేను ఇక్కడికి తీసుకురాలేదు. అయితే ఆ సిరీస్ నుంచి నేర్చుకొన్న కొన్ని అంశాలు మాత్రం కచ్చితంగా ఉన్నాయి. కానీ, అవి భిన్నమైన పరిస్థితులు, ఇక్కడ మా ఫలితాలు కూడా అందుకు భిన్నంగానే ఉన్నాయి. ఇక ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే మేము తుది జట్టును నిర్ణయించాము. రేపు ఆట ప్రారంభానికి ముందు దాన్ని వెల్లడిస్తాం" అని బుమ్ర వివరించాడు.
కెప్టెన్సీలో నాదైన శైలి ఉంటుంది
మిగతా కెప్టెన్లతో పోల్చుకుంటే తన శైలి చాలా భిన్నంగా ఉంటుందని బుమ్రా పేర్కొన్నాడు. "కెప్టెన్సీ అనేది ఓ గౌరవం లాంటిది. నాకంటూ ఓ సొంత శైలి ఉంది. ఇక విరాట్, రోహిత్ కెప్టెన్సీలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. నేను బాధ్యతలు తీసుకోవడాన్ని చాలా ఇష్టపడతాను. నేను గతంలోనే రోహిత్‌తో ఈ విషయం గురించి మాట్లాడాను. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత కెప్టెన్సీపై మరింత క్లారిటీ వచ్చింది. ఓ పేసర్ కెప్టెన్‌గానూ ఉండాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను. మైదానంలో వారి ట్రిక్‌లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. పాట్ కమిన్స్ అద్భుతంగా రాణించాడు. కపిల్‌దేవ్ సహా గతంలో చాలామంది ఉన్నారు. ఈ కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం అని ఆశిస్తున్నాను" అని తన అభిప్రాయాలను బుమ్రా చెప్పుకొచ్చాడు.