India WTC 2025 :బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమిపాలైంది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియాపై ఎలాంటి ప్రభావం పడిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే భారత్ స్థానం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. కానీ, విన్నింగ్ పర్సంటేజీలో తగ్గుదల వచ్చింది. దీంతో రాబోయే మ్యాచ్‌లు భారత్‌కు అత్యంత కీలకంగా మారాయి.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియానే టాప్‌లోనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 12 టెస్టుల్లో 8 విజయాలు సాధించింది. మరో మూడింట్లో ఓడి, ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. దీంతో టీమ్‌ఇండియా ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. పర్సంటేజీలో 74.24 శాతం నుంచి 68.06 శాతానికి తగ్గిపోయింది. ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్‌పై తాజా విజయంతో కివీస్ ఆరో ప్లేస్ నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం కివీస్ 44.40 శాతంతో కొనసాగుతోంది.
ఫైనల్ చేరాలంటే?
భారత్ వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టాప్- 2లో నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నప్పటికీ, కివీస్‌తో ఓటమి వల్ల రాబోయే మ్యాచ్ అత్యంత కీలకంగా మారాయి. భారత్ ఇంకా 7 టెస్టులు ఆడనుంది. కివీస్‌తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల్లో తలపడనుంది. ఇందులో కనీసం 4 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే టాప్-2లో భారత్ నిలుస్తుంది. 67.54 పర్సంటేజీతో దాదాపుగా ఫైనల్ చేరుతుంది.