IND Vs ENG W : అండర్ -19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీస్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 113 పరుగులు మాత్రమే స్కోర్ చేయగా, ఆ లక్ష్యాన్ని భారత్ 15 ఓవర్లలోనే చేధించింది. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 117 పరుగులతో విజయం సాధించింది. ఓపెనర్లు కమలిని (56*), గొంగడి త్రిష (35) తమ ఇన్నింగ్స్‌లో రాణించి జట్టును గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్స్‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది.
ఈ టోర్నీలో భారత బ్యాటర్లు తొలి మ్యాచ్ నుంచే అదిరిపోయే ఫామ్ కనబరిచారు. దాని కొనసాగింపుగానే సెమీస్‌లోనూ చెలరేగిపోయారు. ఇంగ్లీష్ జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. ఓపెనర్లు కమలిని- గొంగడి త్రిష అద్భుమైన ఇన్నింగ్స్‌తో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అయితే త్రిష ఔటైనప్పటికీ భారత ఇన్నింగ్స్‌ను సనికా చల్కే (11*)తో కలిసి కమలిని ముందుకు తీసుకెళ్లింది. దీంతో కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్ ఫోబ్ బ్రెట్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది.