Sachin Kohli Off Stump Out : ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో మాత్రం తన బలహీనతతో ఔట్ కావడం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. తాజాగా గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హేజిల్ వుడ్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని కదిలించి మరీ కోహ్లీ వికెట్ కీపర్‌కు దొరికిపోయాడు. ఇలా ఔట్ కావడం ఈ సిరీస్‌లోనే మూడోసారి. ఆసీస్ బౌలర్లు కోహ్లీకి ఆఫ్ సైడ్ బంతులను వేసి ఊరించి పెవిలియన్‌కు చేరుస్తున్నారు.
సచిన్ బాటలో వెళ్లాలని సూచన!
అయితే టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా 20 ఏళ్ల కిందట కవర్ డ్రైవ్ ఆడి పెవిలియన్ బాట పట్టేవాడు. ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకుని పరుగుల వరద పారించాడు. సచిన్ స్ఫూర్తితో కోహ్లీ ఆఫ్ సైడ్ బంతుల లోపాన్ని మెరుగుపర్చుకోవాలని పలువురు క్రికెట్ పండితులు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
13 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం
2003 చివరలో సచిన్ తాను బ్యాటింగ్ చేసిన 13 ఇన్నింగ్స్‌లో ఒక్క టెస్ట్ సెంచరీని చేయలేదు. అందులో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోని మూడు టెస్టులు ఉన్నాయి. ఇష్టమైన షాట్ కవర్ డ్రైవ్ సచిన్‌కు పెద్ద శత్రువుగా మారింది. దీంతో ఆ షాట్‌కు ప్రయత్నించి సచిన్ అవుట్ అయ్యేవాడు. కానీ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ భాగంగా సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టులో సచిన్ గేర్ మార్చాడు.
డబుల్ సెంచరీ- ఏకంగా 33 బౌండరీలు
సిడ్నీ టెస్టులో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. సచిన్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 436 బంతుల్లో 241 పరుగులు బాదాడు. అందులో 33 ఫోర్లు ఉన్నాయి. అయితే అందులో ఒక్క బౌండరీ కూడా కవర్స్ లో లేకపోవడం గమనార్హం. అయితే సిడ్నీలో తాను ఆడిన నాక్ గురించి గతంలో సచిన్ ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. తన సమస్యను ఎలా అధిగమించానో వివరించాడు.
"ఏ షాట్ వల్ల అవుట్ అవుతున్నామో విశ్లేషించుకోవాలి. కవర్ డ్రైవ్ ఆడకపోవడం అనేది నా ప్లాన్ కాదు. ఆసీస్ ప్లేయర్లు నాకు అన్ని బంతులు ఆఫ్ స్టంప్ వైపే వేసేవారు. వీళ్లు నా సహనాన్ని పరీక్షిస్తున్నారని అప్పుడే నాకు అర్థమైంది. అప్పుడు ఒక విషయం మనసులో అనుకున్నాను. నేను ఒకడిని, మీరు 11 మంది. ముందుగా ఎవరు సహనం కోల్పోతారో చూద్దామని అనుకున్నాను. " అని సచిన్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించినట్లు ఇంగ్లీష్ మీడియా కథనాల్లో రాసి ఉంది.
సచిన్ లా మారాలని!
కాగా, ఆసీస్ పేసర్లు ఆఫ్ సైడ్ వేసిన బంతులను వదిలేసి, మిగతా బంతులను సిడ్నీ టెస్టులో చిదకబాదాడు సచిన్. ముఖ్యంగా లెగ్ సైడ్‌లో విరుచుకుపడ్డాడు. దీంతో డబుల్ సెంచరీ మార్క్‌ను సునాయాశంగా అందుకున్నాడు. దీంతో మ్యాచ్, సిరీస్ డ్రాగా ముగిసింది. అలాగే విరాట్ సైతం చెత్త బంతులను వదిలేయాలని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు. ఆఫ్ స్టంప్ వైపునకు వేసిన బంతులను విడిచిపెట్టాలని సలహా ఇస్తున్నారు.
'నీ బుర్రలో ఏమైనా ఉందా?' - అతడిపై రోహిత్ ఫుల్ ఫైర్
చేసింది 3 పరుగులే అయినా బిగ్ రికార్డ్ బ్రేక్ - ద్రవిడ్‌ను అధిగమించిన కోహ్లీ!