Hardik Pandya Srilanka Tour :శ్రీలంక పర్యటనకు టీమ్ఇండియా పయనమవుతున్న నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఓ ఆసక్తికరమైన ఫొటో అభిమానులతో పంచుకున్నాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని దాటి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడాను అంటూ ఆ పోస్ట్ కింద ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.
"2023 వన్డే ప్రపంచకప్‌లో తగిలిన గాయం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. దీంతో క్రికెట్ ప్రయాణం మునుపటికంటే చాలా కష్టంగా మారింది. చాలా కాలం పాటు ఆటకు దూరమయ్యాను. కానీ టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడం వల్ల అప్పటి వరకు పడిన కష్టానికి ఫలితం అందుకున్నందున సంతోషంగా అనిపించింది. గత కొంత కాలంగా చేసిన కృషికి ఇంతకంటే అద్భుతమైన ముగింపు మరొకటి ఉండదు. కఠోరమైన శ్రమ వృథా కాదు అని నిరూపించేందుకు ఇదొక ఉదాహరణ. తప్పకుండా ఎప్పటికైనా మంచి గుర్తింపు దక్కుతుంది. ఫిట్నెస్ సాధించేందుకు మనమందరం కృష్టి చేద్దాం " అంటూ హార్దిక్ పేర్కొన్నాడు.
2023 వన్డే ప్రపంచ కప్‌లో గాయలపాలైన పాండ్య దాదాపు ఐదు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే చికిత్స తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. అయితే తాను కెప్టెన్‌గా ఉండటం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నాడు. అతడి ఫామ్‌పై కూడా అనేక ప్రశ్నలు వచ్చాయి.