Dhoni Review System : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ ధోనీ అంటే అందరికీ గుర్తొచ్చేది హెలికాప్టర్ షాట్. అది ఒక్కప్పటి కథ. ఇప్పుడైతే అందరికీ ధోనీ రివ్యూ సిస్టమే గుర్తొస్తుంది. ధోనీ ఫీల్డింగ్‌లోకి దిగాడంటే ఇక అంతే. అంపైర్ రాంగ్ డెసిషన్ కూడా డీఆర్ఎస్లో కరెక్ట్ అయిపోతుంది. అంతటి పవర్ ఉంది దానికి. అందుకే ఈ మిస్టర్ కూల్ ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకున్న కూడా తన టీమ్ మేట్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా అతడి మాటకు సపోర్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఈ రివ్యూ సిస్టమ్ మరోసారి నెట్టింట ట్రెండ్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ 13వ ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్ చేశాడు. అయితే మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ వైడ్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ బంతికి ధోనీ రివ్యూ తీసుకున్నాడు. అయితే ఆ రివ్యూ సరైనదే అని తేలింది. దీంతో అంపైర్ వెంటనే తన వైడ్ కాల్‌ను రివర్స్ చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ ధోనీయే కరెక్ట్ అంటూ హోరెత్తారు. నెట్టింట మీమ్స్‌తో ఈ రివ్యూను ట్రెండ్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. మార్కస్ స్టొయినిస్ (124*) ఒక్కడే మొదటి నుంచి చివరి వరకు క్రీడులో ఉండి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. లాస్ట్ ఓవర్‌లో చివరి మూడు బంతుల్లో విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. అయినా స్టొయినిస్ ఒత్తిడిలోనూ బంతిని బాది మ్యాచ్‌ను ముగించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ విజయం సాధించింది. అలా 211 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొత్తంగా 213 పరుగులు చేసింది.