Cristiano Ronaldo Euro 2024 :జర్మనీ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యూరో ఛాంపియన్‌షిప్‌లో పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. స్వోవేనియాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో పోర్చుగల్ 3-0 గోల్స్ తేడాతో స్లోవేనియాపై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. యూరో కప్‌లో పసికూన జార్జియా చేతిలో పరాజయం పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పోర్చుగల్, ఆ తర్వాత వరుస విజయాలతో యూరో కప్ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పడం సంచలనంగా మారింది. ఎందుకంటే?
ఈ మ్యాచ్‌లోని రౌండ్ 16లో పోర్చుగల్‌తో స్లోవేనియా తలపడింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేదు. దీంతో ఇరు జట్ల స్కోర్ 0-0గా నమోదైంది. అంతే కాకుండా మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. ఈ అదనపు సమయం ఆరంభంలోనే పోర్చుగల్‌కు బంగారం లాంటి అవకాశం దక్కింది. పోర్చుగల్ పెనాల్టీని సంపాదించింది. స్టార్ ప్లేయర్ రొనాల్డో కొట్టిన కిక్‌ను స్లోవేనియన్ గోల్ కీపర్ జాన్ ఓబ్లాక్ సేవ్ చేశాడు. దీంతో పోర్చుగల్‌కు అందివచ్చిన అవకాశం చేజారింది. దీంతో రొనాల్డో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ అదనపు సమయంలోనూ ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయకపోవడం వల్ల మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు మళ్లింది. పెనాల్టీ షూటౌట్‌లో రొనాల్డో మొదటి కిక్‌ని గోల్‌గా మలిచాడు. ఈ గోల్ చేసిన అనంతరం రొనాల్డో పోర్చుగల్ అభిమానులకు క్షమాపణలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన ఆటగాళ్లు కూడా గోల్స్ చేయడంతో 3-0తో స్లోవెనియాపై పోర్చుగల్ విజయం సాధించి క్వార్టర్స్ చేరింది. పోర్చుగల్ గోల్‌కీపర్ డియోగో కోస్టా స్లోవేనియా ప్లేయర్లు కొట్టిన మూడు కిక్‌లను అడ్డుకుని హీరో అయ్యాడు.