ఆస్ట్రేలియా - భారత్ మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం రెండు జట్లు సన్నాహాలు మొదలు పెట్టాయి. 2024 నవంబర్ 22న పెర్త్‌లో తొలి టెస్టు మొదలవుతుంది. ఆసీస్ గడ్డపై టీమ్ ఇండియా తొలిసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భారత్ సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియాలో రోహిత్ జట్టును ఎలా నడపిస్తాడు? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఎక్కువ టెస్టు విజయాలు అందుకున్న భారత్ కెప్టెన్ల గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. మరి ఆస్ట్రేలియాలో అద్భుతమైన సక్సెస్ రేటు ఉన్న కెప్టెన్లు ఎవరు? వారిని రోహిత్ శర్మ అధిగమించే అవకాశం ఉందా? ఇప్పుడు చూద్దాం.
అజింక్య రహానే - ఆస్ట్రేలియాలో కెప్టెన్‌గా ఎక్కువ టెస్టు విజయాలు అజింక్య రహానే అందుకున్నాడు. అతడు నాలుగు టెస్టులకే కెప్టెన్‌గా వ్యవహరించినా, విజయాల శాతం 66.67గా ఉంది. అతడి కెప్టెన్సీలో భారత్ ఒక మ్యాచ్ డ్రా చేసుకోగా, మూడు విజయాలు అందుకుంది. 2020-21 సిరీస్‌లో రహానే కెప్టెన్సీలో భారత్ చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందుకుంది.
బిషన్ సింగ్ బేడీ -స్పిన్ బౌలర్‌గా పాపులర్ అయిన బిషన్ సింగ్ బేడీ ఆస్ట్రేలియాలో ఐదు టెస్టులకు భారత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో భారత్ రెండు గెలవగా, మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. బిషన్ సింగ్ బేడీ సక్సెస్ రేటు 40 శాతంగా ఉంది.