Angela Carini Paris Olympics 2024 :పారిస్ ఒలింపిక్స్‌లో తాజాగా జరిగిన ఓ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల బాక్సింగ్ 66 కేజీల ప్రిక్వార్టర్స్ ఈవెంట్లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరాని, అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్ బరిలోకి దిగారు. అయితే ఈ మ్యాచ్‌లో ఖెలిఫ్‌కు ఇదే తొలి బౌట్. కేవలం 46 సెకన్లలోనే ఆమె తన బౌట్‌ను ముగించింది. అలా అని ఓడిపోయిన ఏంజెలా నాకౌట్ కాలేదు. తనంతట తానుగా బౌట్ నుంచి తప్పుకుంది.
ఖెలిఫ్ పంచ్ పవర్‌కు భయపడి ఏంజెలా బౌట్ నుంచి నిష్క్రమించింది. ఆమె రెండు సార్లు ఏంజెలా తల భాగంపై అటాక్ చేయగా, అప్పుడు ఆమె హెడ్ సేఫ్టీ తొలిగిపోయింది. అంతే కాకుండా ముక్కులో తీవ్ర నొప్పి రావడంతోనే బౌట్ నుంచి వైదొలిగినట్లు ఏంజెలా పేర్కొంది.
"ఖెలిఫ్ పంచ్ ఒకటి నా ముఖంపై బలంగా తాకింది. రక్తం కూడా వచ్చింది. నా కెరీర్‌లో ఇంతటి బలమైన పంచ్‌లు ఎదుర్కొలేదు. ముక్కు చాలా నొప్పిగా ఉంది. ఓ పరిణతి చెందిన బాక్సర్‌గా బౌట్‌ను ఆపేద్దామని అనుకున్నా. ఎవరు ఏమిటి అని చెప్పేందుకు నేనిక్కడికి అస్సలు రాలేదు. నేను మా నాన్న కోసం ఈ గేమ్‌లో ఎలాగైనా గెలవాలనుకున్నాను. కానీ అది జరగలేదు" అంటూ ఏంజెలా కన్నీరు మున్నీరైంది.