Which Temple is Best to visit on January 1: మరో నాలుగు రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం (2025) రానుంది. ఈ క్రమంలో జనవరి 1వ తేదీన చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు. ఆ సంవత్సరం మొత్తం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తారు. కొద్దిమంది అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళితే.. మరికొద్దిమంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటుంటారు. అయితే.. జనవరి 1వ తేదీన ఈ దేవాలయాలను దర్శించుకుంటే సంవత్సరం మొత్తం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి లభిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ బుధవారం వచ్చిందని.. బుధవారానికి బుధుడు అధిపతి అని మాచిరాజు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు కూడా అధిష్ఠాన దేవతలు ఉంటారని.. అలాగే బుధగ్రహానికి కూడా ఇద్దరు అధిష్ఠాన దేవతలు ఉన్నారని.. ఒకరు గణపతి.. మరొకరు విష్ణుమూర్తి అని అంటున్నారు. కాబట్టి జనవరి ఒకటవ తేదీన బుధవారం రోజు గణపతి ఆలయం లేదా విష్ణుమూర్తి ఆలయాలను దర్శించుకోవాలని చెబుతున్నారు.
గణపతి ఆలయంలో పాటించాల్సిన విధివిధానాలు:జనవరి 1వ తేదీన అందుబాటులో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లమంటున్నారు మాచిరాజు కిరణ్ కుమార్. గణపతి ఆలయంలో చేయాల్సిన పనులు ఏంటంటే..
- ఆ రోజున గణపతికి అభిషేకం చేయమని సలహా ఇస్తున్నారు.
- గరిక, ఎర్రటి పుష్పాలతో అర్చన చేయమంటున్నారు.
- ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయమని సూచిస్తున్నారు.
- అలాగే దేవాలయంలో కొబ్బరినూనెతో దీపం వెలిగించమని చెబుతున్నారు.
- వీటిలో ఏది చేసినా బుధుడి అనుగ్రహంతోపాటు గణపతి ఆశీస్సులు లభిస్తాయని.. తద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగంలో సంవత్సరం మొత్తం అద్భుతంగా రాణించవచ్చని చెబుతున్నారు.
విష్ణుమూర్తి ఆలయంలో పాటించాల్సిన విధివిధానాలు: జనవరి 1వ తేదీన అందుబాటులో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లినా మంచిదే అంటున్నారు నిపుణులు. విష్ణుమూర్తి ఆలయం అంటే.. శ్రీరాముడు, కృష్ణుడు, నరసింహ స్వామి, వేంకటేశ్వర స్వామి.. ఇలా విష్ణు రూపానికి సంబంధమైన ఆలయాలను దర్శించుకోవచ్చంటున్నారు. విష్ణుమూర్తి ఆలయంలో చేయాల్సిన పనులు ఏంటంటే..
- ఆలయంలో అర్చన చేయించుకోమంటున్నారు.
- విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించమని చెబుతున్నారు.
- ఆలయంలో ప్రదక్షిణలు చేయమని సూచిస్తున్నారు.
- ఆలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించమంటున్నారు. అంటే ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడిగా వేసి దీపం పెట్టమని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
Note :పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.