Which Side Ganesha Trunk is Good: వినాయక చవితి వస్తుందంటే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతీ వాడలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పార్వతీ తనయుడికి మొక్కుతారు. ఇక వినాయక చవితి సమయంలో ఎక్కడ చూసినా గణపతి మండపాలతో సందడి నెలకొంటుంది. పచ్చని మామిడి ఆకులు, పూలతో ఘనంగా గణపతికి పూజలు చేస్తారు. అలానే కేవలం వీధుల్లో కాకుండా చాలా మంది ఇంట్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గణపయ్యకు పూజలు చేస్తారు. అయితే, వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా విగ్రహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వెల్లడిస్తున్నారు. వినాయక చవితి నేపథ్యంలో గణపతిని పూజించే ముందు ఆ సూచనలు ఏంటో తెలుసుకోండి.
విగ్రహ తొండం ఆ వైపునకు వంగి ఉండాలట:మనం ఇంట్లో లేదా మండపాల్లో ప్రతిష్ఠించుకునే వినాయకుడి విగ్రహ తొండం వినాయకుడికి ఎడమ వైపునకు వంగి ఉండాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఇలాంటి విగ్రహం చాలా శుభప్రదమని.. దీన్ని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి ధన లాభం చేకూరుతుందని వివరిస్తున్నారు. దీంతోపాటు గణపతిని ఏదైనా ఆసనం లేదా ఎలుకపై కూర్చున్న విగ్రహాన్ని తీసుకుంటే మంచిదని తెలుపుతున్నారు. నిలుచున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదని సూచిస్తున్నారు.
ఆ రంగు విగ్రహాలను తీసుకోకూడదట!:అదే విధంగా వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు రంగులు కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా మంది విగ్రహాలు ఆకర్షణీయంగా ఉండాలనే భావనతో ప్రకృతికి నష్టం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. అయితే, ఆకర్షణీయంగా ఉన్న రంగురంగుల విగ్రహాలను కొనాలన్న ఉద్దేశంతో నలుపు రంగు ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదని వివరిస్తున్నారు.