Vivaha Panchami Vratha Katha :మార్గశిర మాస శుద్ధ పంచమిని వివాహ పంచమిగా జరుపుకుంటాం. వ్రతం పూర్తయిన తర్వాత వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే వ్రతం ఆచరించిన ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. వివాహ పంచమి పూజా విధానాన్ని సవివరంగా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు వ్రత కథను కూడా తెలుసుకుందాం.
శ్రీ వాల్మీకి రామాయణంలో వివాహ పంచమి వ్రత కథను గురించి వివరించారు. పెద్దలు, గురువులు సూచించిన ప్రకారం సీతారాముల స్వయంవరం, సీతారాముల కల్యాణమే వివాహ పంచమి వ్రత కథగా చదువుకోవాలని తెలుస్తోంది.
వివాహ పంచమి కథ
ఒకానొక సమయంలో మహర్షి విశ్వామిత్రుడు అయోధ్య రాజు దశరథుడి వద్దకు వెళ్లి తన యజ్ఞానికి రాక్షసుల నుంచి ఆటంకాలు కలుగుతున్నాయని, తన యజ్ఞాలు నిరాటంకంగా కొనసాగడానికి, రాక్షసుల బారి నుంచి యజ్ఞాన్ని కాపాడేందుకు యువరాజు శ్రీరాముని తనతో పంపమని అడుగుతాడు. ముందు సందేహించినా కులగురువు వశిష్టుని సలహా మేరకు దశరథుడు విశ్వామిత్రుని వెంట రాముని పంపేందుకు అంగీకరిస్తాడు. విశ్వామిత్రుడితో పాటు రాముడు, లక్ష్మణుడు కూడా యాగరక్షణకు బయల్దేరి వెళ్తారు. వీరి సహాయంతో యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విశ్వామిత్రుడు యువరాజులతో కలిసి మిథిలా నగరానికి వెళతాడు.
సీతా స్వయంవరం
ఆ సమయంలో మిథిలా నగరంలో మిథిలాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవి స్వయంవరం జరుగుతుంటుంది. శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి సీతా దేవితో కల్యాణం జరిపిస్తానని మిథిల రాజు ప్రకటిస్తాడు. అయితే శివధనుస్సును ఎక్కు పెట్టడానికి ఎందరో రాజులు ప్రయత్నించినప్పటికీ ఎవరికీ విజయం దక్కదు. చివరికి శ్రీరాముని శివధనుర్బంగం చేయమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు.