Vijayawada Kanaka Durga Temple History : కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శ్రీ దేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గా మాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది
దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్ర కీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతాస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
పెంకి గుర్రంతో బయలు దేరిన రాకుమారుడు
పూర్వం విజయవాటికపురిని పరిపాలించే మాధవ వర్మ తన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల నడిచేటట్లుగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖశాంతులతో ఉండేవారు. ఒకరోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజ భటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు రాకుమారుని రథ చక్రాల కిందపడి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణిస్తాడు.
కుమారునికి మరణదండన విధించిన రాజు
బాలుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై తమకు న్యాయం చేయాలని రాజును ఆశ్రయిస్తారు. అప్పుడు జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని గ్రహించి మాధవ వర్మ వారికి పుత్రశోకం కలిగించిన తన కుమారుడికి మరణ దండన విధిస్తారు.
కనక వర్షం కురిపించిన అమ్మవారు
అంతట రాజు యొక్క ధర్మనిరతి మెచ్చిన అమ్మవారు ఆ బాలుని బతికించడమే కాకుండా విజయవాటిక పురమునందు కొన్ని ఘడియల పాటు కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గా దేవిగా పూజించడం మొదలు పెట్టారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారం కూడా చేస్తారు.
ఇంద్రకీలాద్రి అనే పేరు ఇలా వచ్చింది?
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, తాను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్ర కీలాద్రిగా మారింది. ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది.