Appalayagunta Prasanna Venkateswara Swamy :కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీపద్మావతితో నారాయణవనంలో వివాహానంతరం తిరుమలకు చేరుకునే ముందు అనేక ప్రాంతాల్లో సంచరించాడు. అందులో ఒకటి అప్పలాయగుంట. సాక్షాత్తు స్వామి వారు నివసించిన ఈ పవిత్ర ప్రదేశం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రసన్న వెంకటేశ్వర స్వామి పేరు ఇందుకే!
వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను ఉద్దరించడానికి స్వయంభువుగా తిరుమల గిరుల్లో వెలిశాడు. నారాయణవనంలో శ్రీ పద్మావతితో వివాహం అనంతరం శ్రీనివాసుడు అప్పలాయగుంటలో కొంతకాలం నివాసమున్నాడు. ప్రసన్నంగా స్వామి ఇక్కడ భక్తులను అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడి స్వామికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరు.
స్థల పురాణం
శ్రీ వేంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని స్థల పురాణం.
అన్ఋణ సరోవరం
పూర్వం అప్పలాయగుంట ప్రాంతాన్ని అన్ఋణ సరోవరం అంటే ఋణం లేని సరోవరం అని పిలిచేవారు. ఈ ప్రాంతానికి అప్పలాయ గుంట అనే పేరు రావడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
అప్పులయ్య కథ
పూర్వం ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్లుగా అతను అందరి వద్ద అప్పులు చేస్తుండేవాడు. అదే ఊరికి చెందిన మరో వ్యక్తి అప్పులయ్య సంగతి తెలిసి దురాశతో అతని దగ్గర డబ్బులు కాజేయాలన్న దుర్బుద్ధితో అప్పులయ్య తనకు కూడా బాకీ ఉన్నాడని బాకీ తీర్చమని వేధించ సాగాడు. ఊరి జనమంతా అప్పులయ్య అందరి వద్ద అప్పులు చేస్తుంటాడు కాబట్టి అది నిజమే అని నమ్మారు. అప్పులయ్య తాను ఆ వ్యక్తి నుంచి డబ్బు అప్పుగా తీసుకోలేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు విసిగిపోయిన అప్పులయ్య 'నేను ఋణం తీసుకోలేదు' అని ఒక రాయి మీద వ్రాసి దానిని కోనేరులో వేస్తాడు.
కోనేరులో తేలిన రాయి
సాధారణంగా రాయి వంటి బరువైన వస్తువులు నీటిలో వేస్తే మునిగిపోతాయి. కానీ ఆశ్చర్యకరంగా అప్పులయ్య 'నేను ఋణం తీసుకోలేదు' అని వ్రాసి కోనేటిలో వేసిన రాయి మాత్రం పైకి తేలసాగింది. అది చూసిన గ్రామస్థులు అప్పులయ్య నిజాయితీ పరుడని నమ్మారు. ఆనాటి నుంచి ఆ కోనేరును అన్ఋణ సరోవరమని పిలిచేవారు.
అప్పులు లేని గుంట అప్పలాయ గుంట
మరో కథనం ప్రకారం, ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుంచి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా మారిందని, కాలక్రమేణా అప్పలాయగుంట మారిందని తెలుస్తోంది. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పని చేసిన వారికి కూలి అప్పు పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజే ఇచ్చేవాడని అందుకనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అంటారు.