Som Pradosh Vrat Vidhi In Telugu : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం శివారాధనకు ప్రదోష సమయం అత్యంత పవిత్రమైనది. ప్రదోష సమయం ఉన్న రోజు శివుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఈ సందర్భంగా అసలు ప్రదోషం అంటే ఏమిటి? అందులో సోమప్రదోష విశిష్టత ఏమిటి? ప్రదోష వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ప్రదోషం అంటే ఏమిటి? సోమ ప్రదోషం అంటే ఏమిటి?
శివపూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాలు ప్రదోష కాలంగా పేర్కొంటారు. ప్రదోషం వచ్చే రోజు, తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రతి రోజూ వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అనీ, త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు. ప్రదోష వ్రతాలను త్రయోదశి తిథిలో శుక్ల పక్ష త్రయోదశి, కృష్ణ పక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు.
సోమ ప్రదోషం ఎప్పుడు?
జనవరి 27 వ తేదీ పుష్య బహుళ త్రయోదశి , సోమవారం కలిసి వచ్చినందున ఆ రోజును సోమ ప్రదోషంగా పాటించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. సోమవారం, త్రయోదశి తిథితో కలిసి ఉంటే ఆ ప్రదోషాన్ని సోమ ప్రదోషమని అంటారు.
సోమ ప్రదోష పూజకు శుభసమయం
ఏ రోజైతే త్రయోదశి తిధి సూర్యాస్తమయం తరువాత కనీసం 2.30 గంటల సమయం పాటు ఉంటుందో ఆ సమయాన్ని ప్రదోష సమయంగా భావించాలి. అందుకే ప్రదోష పూజను సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవాలి. జనవరి 27 వ తేదీ సోమవారం సాయంత్రం 7:30 నిమిషాల వరకు త్రయోదశి తిధి ఉంది కాబట్టి ఆ రోజునే సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
సోమ ప్రదోషం రోజు ఏ దేవుని పూజించాలి?
వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం సోమ ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. అందునా సోమవారం, ప్రదోషం కలిసి వచ్చిన సోమ ప్రదోషం రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్ర వచనం.