Significance Of Shivaratri : హిందువుల పండుగలలో సంక్రాంతి తరువాత వచ్చే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి రోజును మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం. అయితే మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మనం మహా శివరాత్రిగా జరుపుకుంటాం. శివ పురాణం ప్రకారం మహా శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించినట్లుగా తెలుస్తోంది. అసలు మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటాం? మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మహాశివరాత్రి విశిష్టత
సాధారణంగా మనం ప్రతి పండుగను పగలు జరుపుకుంటే శివరాత్రి పండుగను మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. అదే ఈ పండుగ యొక్క విశిష్టత. హిందూ సంప్రదాయం ప్రకారం అందరి దేవుళ్లను విగ్రహ రూపంలో ఆరాధిస్తే, శివుని మాత్రం లింగాకారంలో పూజిస్తాం.
శివలింగ ఆవిర్భావ ఘట్టం
మన పురాణాల్లో శివరాత్రి పండుగ గురించి, శివలింగ ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం, ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప? అనే చర్చ మొదలైంది. చర్చగా మొదలైన ఈ విషయం చిలికి చిలికి గాలివాన అయింది. ఎవరికి వారు తామే గొప్ప అంటూ కలహించుకోవడం మొదలు పెట్టారు.
శివుని మధ్యవర్తిత్వం
ఆ సమయంలో బ్రహ్మ, విష్ణువుల యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుని మధ్యవర్తిత్వం చేయమని కోరారు. వారి పోరాటం వ్యర్థం అని తెలియ చెప్పటానికి, శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక అగ్ని స్తంభం లాగా, లింగాకారంలో ఆవిర్భవించాడు.
ఆది అంతములను కనుగొనమన్న మహేశ్వరుడు
అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ, విష్ణువులకు ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే ఈ అగ్ని స్తంభం ఆది, అంతాలను కనిపెడతారో వారే గొప్పవారని శివుడు చెబుతాడు. అప్పుడు బ్రహ్మ హంస రూపంలో అగ్ని స్తంభం అంతాన్ని కనుగొనడానికి పైకి, విష్ణువు వరాహ రూపంలో అగ్ని స్తంభం మొదలును కనుగొనడానికి కిందికి వెళ్లారు. కానీ వారు ఆ స్తంభం యొక్క ఆదిని కానీ అంతాన్ని కానీ కనుగొనలేకపోయారు. వేల మైళ్ళ దూరం ప్రయాణించినా కూడా వారు ఆద్యంతాలును కనుగొనలేదు.
బ్రహ్మ కపట బుద్ధి
అంతట బ్రహ్మ శివుని కనుగొనే మార్గంలో తనకు కనిపించిన కేతకి పుష్పాన్ని, కామధేనువును తాను ఆ స్తంభం యొక్క అంతాన్ని చూసినట్లుగా శివుని దగ్గర సాక్ష్యం చెప్పమని కోరాడు. తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆ అగ్ని స్థంభం యొక్క అంతాన్ని చూశానని చెప్పగా, విష్ణువు బ్రహ్మ గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు షోడసోపచార పూజలు చేస్తాడు.