తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

త్రినేత్రుడి మూడు రూపాలు- ఇలా పూజిస్తే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయి! - Lord Shiva Worship Benefits - LORD SHIVA WORSHIP BENEFITS

Lord Shiva Worship : సోమవారం పరమ శివుని ఆరాధనకు విశిష్టమైనది అన్న సంగతి తెలిసిందే! సోమవారం పరమ శివునికి చేసే అభిషేకాలు, ప్రదోష పూజలతో శారీరక మానసిక రోగాలు తొలగిపోయి ప్రశాంతత కలుగుతుందని శాస్త్ర వచనం. ముఖ్యంగా సోమవారం ప్రదోష సమయంలో శివుని మూడు రూపాలను పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Lord Shiva
Lord Shiva (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 3:34 AM IST

Lord Shiva Worship : వేద వ్యాసుడు రచించిన శివ మహా పురాణం ప్రకారం శివుని మూడు రూపాలను సోమవారం ప్రదోష సమయంలో పూజిస్తే కలిగే ఫలితాలు అనంతం. అసలేమిటీ శివుని మూడు రూపాలు? వివరంగా తెలుసుకుందాం.

1. నీలకంఠుడు
క్షీరసాగర మథనం సమయంలో ముందుగా ఉద్భవించిన లోకాలను రక్షించడానికి శివుడు హాలాహలాన్ని సేవించి తన గొంతులో నిలుపుకున్నాడు. ఆనాటి నుంచి ఆ మహేశ్వరుని కంఠం నీలం రంగులోకి మారింది. అప్పటి నుంచి శివుని నీలకంఠుడు అని పిలుస్తారు. ఈ నీలకంఠేశ్వరుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు ప్రదోష సమయంలో అంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపు నీలకంఠేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భయాలు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు, కుట్రలు, తంత్ర మంత్రాల ప్రభావం తొలగిపోతాయని పెద్దలు, గురువులు చెబుతారు.

నీలకంఠుని ఇలా పూజించాలి
సోమవారం ప్రదోష వేళ శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి, శివుని నీలకంఠ రూపాన్ని స్మరించుకుని ఓం నమో నీలకంఠాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలో శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. శివుని ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

2. నటరాజ స్వామి
పరమశివుని అద్భుతమైన, అతి ముఖ్యమైన రూపం నటరాజ స్వామి రూపం. నటరాజ స్వామిని నృత్యానికి ఆది దేవునిగా పూజిస్తారు. ఈ రూపంలో శివుడు సృష్టి, స్థితి లయకారుడిగా దర్శనమిస్తాడు. నటరాజ స్వామికి ఒక చేతిలో ఉన్న అగ్ని వినాశనానికి చిహ్నంగా ఉంటే, అభయ ముద్రలో ఉన్న మరో చేయి అభయానికి సంకేతంగా నిలుస్తుంది. నటరాజ రూపాన్ని ఆరాధించడం వలన కళారంగంలో రాణించేవారికి ప్రతికూలతలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయి.

నటరాజ స్వామిని ఇలా పూజించాలి
సోమవారం ప్రదోష సమయంలో నటరాజ స్వామిని మల్లెలతో పూజించాలి. నృత్య గీతాలతో ఆరాధించాలి. నటరాజ స్వామిని ఇలా పూజిస్తే జ్ఞానం, విద్యాబుద్ధులు, సంగీత నృత్యాలలో ప్రావీణ్యత సాధిస్తారు.

3. మహామృత్యుంజయ స్వరూపం
పరమశివుని మూడవ స్వరూపం, ముఖ్యమైనది మహామృత్యుంజయ స్వరూపం. శివుని మహామృత్యుంజయ స్వరూపం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు.

మహామృత్యుంజయ స్వరూపాన్ని ఇలా పూజించాలి
సోమవారం ప్రదోష వేళ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ శివలింగాన్ని ఆవు నేతితో, తేనెతో, గంగాజలంతో అభిషేకిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. శివుని మహామృత్యుంజయ రూపాన్ని ఆరాధించడం వలన నయం కాని రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. మృత్యు భయం తగ్గుతుంది. జీవితంలో శాంతి లభిస్తుంది. అంతేకాదు శివుని మహామృత్యుంజయ రూపాన్ని ఆరాధించడం వల్ల అపారమైన బలం, ఆత్మబలం కూడా లభిస్తుందని తెలుస్తోంది. మనం కూడా సోమవారం రోజు పరమ శివుని ఈ రూపాలను ఆరాధిస్తూ జీవితంలో సకల శ్రేయస్సును పొందుదాం.

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details