Rama Lakshmana Dwadashi Vratham : జ్యేష్ఠ మాసంలో పవిత్రమైన నిర్జల ఏకాదశి పక్కరోజు వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశిగా జరుపుకుంటాం. వరాహ పురాణం ప్రకారం ప్రతినెలా శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశేషమైనదే! రామలక్ష్మణ ద్వాదశిని చంపక ద్వాదశి అని కూడా అంటారు.
రామలక్ష్మణ ద్వాదశి వెనుక పురాణ గాథ
పుత్రసంతానం కోసం పరితపిస్తున్న దశరధ మహారాజుకు వశిష్ఠుడు రామలక్ష్మణ ద్వాదశి వ్రత విధానాన్ని వివరించాడు. దశరధ మహారాజు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి రోజు ఈ వ్రతాన్ని ఆచరించగా అక్కడ నుంచి సరిగ్గా 10 నెలల తర్వాత వచ్చిన చైత్ర మాసంలో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు దశరధ మహారాజుకు జన్మించారు. అందుకే పుత్ర సంతానం కోరుకునే వారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని శాస్త్రం చెబుతోంది.
వ్రత విధానం
పుత్ర సంతానం కోరుకునేవారు రామలక్ష్మణ ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై రామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించి, శాస్త్రోకంగా కలశ స్థాపన చేయాలి. అనంతరం రామలక్ష్మణులకు ఆవాహన, ఆచమనం వంటి 16 రకాల షోడశోపచార పూజలు చేయాలి. రామలక్ష్మణులకు వస్త్ర సమర్పణ చేయాలి. పూజ పూర్తి అయ్యేవరకు ఉపవాసం చేయాలి.
ఈ రోజు ఈ దానాలు చేయాలి
ఈ సందర్భంగా రామలక్ష్మణ ద్వాదశి ముందు నిర్జల ఏకాదశి రోజు ఆర్ధికంగా శక్తి ఉన్నవారు బంగారు రామలక్ష్మణులు విగ్రహాలను పూజించి, రామలక్ష్మణ ద్వాదశి రోజు పూజించిన బంగారు విగ్రహాలను దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్ర వచనం. శక్తికొద్దీ మట్టి ప్రతిమలను కూడా దానం చేయవచ్చు. అంతేకాకుండా ఈ రోజు బ్రాహ్మణులకు గోదానం, భూదానం, వస్త్ర దానం, సువర్ణ దానం వంటి దానాలు కూడా విరివిగా చేస్తే వ్రతఫలం అధికమవుతుంది.
ఒడిషాలో ఇలా!
రామలక్ష్మణ ద్వాదశిని ఒడిషాలో చంపక ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో ఇది చాలా ముఖ్యమైన పండుగ. పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఈ పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. ఉత్కళ బ్రాహ్మణులకు రామలక్ష్మణ ద్వాదశి పవిత్రమైన రోజు. జగన్నాధునికి ఈ రోజు విశేష పూజలు, ప్రత్యేక ప్రసాదాలు తయారు చేస్తారు. ఈ పూజలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు.