Shattila Ekadashi Vrat Katha :ఏ పూజైనా, వ్రతమైనా పూజావిధి పూర్తయ్యాక ఆ వ్రతానికి సంబంధించిన కథను చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటేనే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. ఈ కథనంలో షట్టిల (షట్తిల) ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం.
షట్తిల ఏకాదశి వ్రత కథ
చాలా కాలం క్రితం జరిగిన ఘటన. దాదాపుగా ద్వాపర యుగంలో ఈ సంఘటన జరిగినట్లుగా చెబుతారు. ఒక ఊరిలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ఆమె తన సంపదను దానధర్మాలకు వెచ్చించింది. అడిగినవారికి కోరినంత ధనం, ఆభరణాలు ఇలా విలువైన వస్తువులను ఎన్నింటినో దానం చేసిన ఆమెకు ఎందుకో అన్నదానం చేయడం ఇష్టం ఉండేది కాదు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అని చెబుతారు కదా. ఈ విషయమై అందరూ ఆమెకు ఎంతో నచ్చ చెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది. ఆమె ఆహారం మినహా ప్రజలు కోరుకునే ఏదైనా దానం చేసేది.
శ్రీకృష్ణుని మాయ
ఇదిలా ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు ఆ శ్రీమంతురాలికి అన్నదానం గొప్పతనాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. కృష్ణుడు బిచ్చగాడి రూపాన్ని ధరించి, శ్రీమంతురాలి వద్దకు వెళ్లి ఆహారం అర్ధించాడు. కానీ ఆ స్త్రీ బిచ్చగాడికి భిక్షలో ఆహారం ఇవ్వడానికి నిరాకరించి అతనిని తరిమికొట్టింది. పట్టువదలని ఆ భిక్షకుడు తిరిగి వచ్చి మళ్లీ ఆహారం కోసం అడుగగా, ఆమె అతని భిక్షా పాత్రలో మట్టిని వేసి అవమానించింది. ఆశ్చర్యకరంగా ఆ భిక్షకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
మట్టిగా మారిన సకల సంపదలు
భిక్షకుని వెళ్లగొట్టి శ్రీమంతురాలు తిరిగి ఇంట్లోకి వెళ్లేసరికి ఆమె ఇంట్లో వండిన ఆహారమంతా మట్టిగా మారడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అంతేకాదు ఆమె తినడం కోసం ఏది కొన్నా అది మట్టిగా మారిపోతుండేది. అంత సంపద ఉన్నప్పటికీ, ఆమె తినడానికి కొన్నవి కొన్నట్లు మట్టిగా మారిపోతుండడం వల్ల ఆమెకు ఆహారం కరువైంది. ఇంట్లో సకల సంపదలు ఉన్నా ఆమె తినడానికి మాత్రం ఏమి ఉండేది కాదు. ఆ విధంగా ఆకలితో శ్రీమంతురాలి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం ప్రారంభించింది.