Kumararama Bhimesavara Swami Temple :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తిక మాసం, శివరాత్రి పర్వదినాల్లో భక్తులు వీటి సందర్శనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ప్రత్యేకంగా పంచ శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటినే పంచారామాలు అని అంటారు. వీటిల్లో కుమారస్వామి స్వయంగా ప్రతిష్టించినట్లుగా చెబుతున్న కుమార భీమేశ్వరస్వామి ఆలయ చరిత్ర, స్థల పురాణం గురించి తెలుసుకుందాం.
కుమార భీమేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది?
తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉన్న ఆ పంచారామ క్షేత్రమే కుమార భీమేశ్వర స్వామి ఆలయం.
భీమేశ్వర స్వామి ఆలయ పురాణ కథనం
పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేస్తాడు. అతడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఒక్క బాలుని చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేని విధంగా తారకాసురుడు శివుని నుంచి మరో వరాన్ని కూడా పొందుతాడు.
వరగర్వంతో తారకాసురుని ఆగడాలు
తారకాసురుడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని కంఠంలో ఉంచుకుని ఆ శక్తితో దేవతలను ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు.
విష్ణువును శరణు వేడిన దేవతలు
తారకాసురుని ఆగడాలు భరించలేక దేవతలంతా విష్ణువును శరణు వేడుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలతో పరమేశ్వరుడి తేజో రూపంతో జన్మించే కుమారుడు తప్ప మరెవ్వరూ తారకాసురున్ని అంతం చేయలేరని, ఇందుకోసం పరమేశ్వరున్ని ప్రార్థించాలని తరుణోపాయం చెబుతాడు.
పరమశివుని ప్రార్థించిన దేవతలు
విష్ణుమూర్తి సూచన మేరకు దేవతలంతా తారకాసురుని ఆగడాల నుంచి కాపాడమని పరమశివుని వేడుకుంటారు. ఓ శుభ ముహూర్తాన శివ తేజస్సుతో కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి చిన్నవయసులోనే యుద్ధ విద్యలన్ని అభ్యసించి నిష్ణాతుడు అవుతాడు.
తారకాసుర వధ
కుమారస్వామి దేవతా గణములతో కలిసి తారకాసురున్ని ఎదుర్కొంటాడు. తారకాసురుని వధించాలంటే ఆత్మ లింగాన్ని చేధించాలని తెలుసుకుని అతడి కంఠంలోకి బాణ ప్రయోగం చేస్తాడు. దీంతో ఆత్మలింగం చెల్లాచెదురై తారకాసురుడు మరణిస్తాడు. ఆ ముక్కలైన ఆత్మలింగం భూమిపై వివిధ ప్రదేశాల్లో పడిందని, అవే ఆంధ్రప్రదేశ్ లోని పంచారామ క్షేత్రాల్లో ఉన్న శివ లింగాలు అని స్కంద పురాణం, శివమహాపురాణం ద్వారా తెలుస్తోంది.
కుమారరామం
కుమార రామంలో 14 అడుగుల ఎత్తులో రెండు అంతస్తులలో ఉండే తెల్లని స్పటిక లింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్టించినట్లు పురాణ కథనం. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామం అని పిలుస్తారు.
కుమారరామం ఆలయ చరిత్ర
క్రీస్తు శకం 892 నుంచి క్రీస్తు శకం 922 మధ్య ప్రాంతంలో చాళుక్య రాజు అయిన భీముడు సామర్లకోటలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామ భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు. 1340 - 1466 మధ్య కాలంలో కాకతీయ పాలకులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు.