తెలంగాణ

telangana

'కాణిపాకం' బ్రహ్మోత్సవాలు- గణపయ్య ఏ రోజు ఏ వాహనంపై దర్శనమివ్వనున్నారో తెలుసా? - Kanipakam Brahmotsavam 2024

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 5:17 AM IST

Kanipakam Brahmotsavam 2024 Full Details : దేశవ్యాప్తంగా ఉన్న వినాయకుని ఆలయాలలో గణేష్ నవరాత్రులు పది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. అలాగే వినాయకుడు స్వయంభువుగా వెలసిన అతి ప్రాచీనమైన క్షేత్రం కాణిపాకంలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాల వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Kanipakam Brahmotsavam 2024
Kanipakam Brahmotsavam 2024 (ETV Bharat)

Kanipakam Brahmotsavam 2024 Full Details : సత్య ప్రమాణాల స్వామిగా ప్రసిద్ధి చెందిన వరసిద్ధి వినాయకుడు స్వయంభువుగా వెలసిన కాణిపాకం క్షేత్రం అతి ప్రాచీనమైన వినాయక క్షేత్రం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తొలి పూజ అందుకనే వినాయకుడికి పరమశివుడు గణాధిపత్యం ఒసంగిన పరమ పవిత్రమైన భాద్రపద శుద్ధ చవితి రోజును వినాయక చవితిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న గణేశ ఆలయాలలో పదిరోజులపాటు గణేశ నవ రాత్రుల పేరిట ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. స్వయంభువుగా వినాయకుడు వెలసిన కాణిపాకం క్షేత్రంలో వినాయక చవితి నుంచి పది రోజుల పాటు ఘనంగా బ్రహోత్సవాలు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలను తెలుసుకుందాం.

బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభం?
కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి ప్రారంభమై 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దేవస్థానం వారు ఇప్పటికే పూర్తి చేసారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ బ్రహ్మోత్సవాలలో ఏ రోజు ఏ సేవ జరగనుందో తెలుసుకుందాం.

బ్రహ్మోత్సవాల వివరాలు

  • తొలుత అవిఘ్నమస్తు అంటూ బ్రహ్మోత్సవాలు వినాయక చవితి వేడుకలతో సెప్టెంబర్ 7న ప్రారంభమవుతాయి.
  • సెప్టెంబర్ 8న ధ్వజారోహణం, హంసవాహన సేవ జరుగనుంది.
  • సెప్టెంబర్ 9న నెమలి వాహనంపై ఊరేగుతూ గణపతి భక్తులను అనుగ్రహిస్తాడు.
  • సెప్టెంబర్ 10న మూషిక వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
  • సెప్టెంబర్ 11న వినాయకుడు శేష వాహనంపై విహరించనున్నారు.
  • సెప్టెంబర్ 12న ఉదయం చిలుక వాహనం, రాత్రి వృషభ వాహనంపై గణనాధుడు ఊరేగనున్నారు.
  • సెప్టెంబర్ 13వ తేదీన గజ వాహనంపై వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు.
  • సెప్టెంబర్ 14వ తేదీన రథోత్సవం జరుగనుంది.
  • సెప్టెంబర్ 15వ తేదీన బిక్షాండి, అదే రోజున సాయంత్రం తిరుకళ్యాణం, రాత్రి అశ్వవాహన సేవలు వరుసగా జరగనున్నాయి.
  • సెప్టెంబర్16న సాయంత్రం ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, రాత్రి జరిగే ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ప్రత్యేక ఉత్సవాలు సేవల వివరాలు

  • కాణిపాకంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రత్యేక ఉత్సవాలు సెప్టెంబర్ 17 వ తేదీ నుంచి మొదలవుతాయి.
  • సెప్టెంబర్ 17న అధికార నంది వాహన సేవ జరుగుతుంది.
  • సెప్టెంబర్ 18న రావణ బ్రహ్మ వాహనం పై వినాయకుడు భక్తులకు దర్సనమిస్తాడు.
  • సెప్టెంబర్ 19న యాళి వాహన సేవ జరుగుతుంది.
  • సెప్టెంబర్ 20న విమానోత్సవం జరుగుతుంది.
  • సెప్టెంబర్ 21న పుష్ప పల్లకి సేవ జరుగనుంది.
  • సెప్టెంబర్ 22న కామధేను వాహన సేవ జరుగుతుంది.
  • సెప్టెంబర్ 23న సూర్య ప్రభ వాహనంపై భక్తులకు వినాయకుడు దర్శనమిస్తాడు.
  • సెప్టెంబర్ 24న చంద్ర ప్రభ వాహనసేవ జరుగనుంది.
  • సెప్టెంబర్ 25న కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది.
  • సెప్టెంబర్ 26న గణనాథునికి పూలంగి సేవ జరుగుతుంది.
  • సెప్టెంబర్ 27న జరుగనున్న తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి.

కోలాహలంగా కాణిపాక క్షేత్రం
కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకునికి అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలను, ప్రత్యేక ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి అసంఖ్యాక భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. ప్రతిరోజూ జరిగే వాహన సేవల్లో కోలాటాలు, చెక్క భజనలు, ఇతర కార్యక్రమాలతో కాణిపాక క్షేత్రం సందడిగా ఉంటుంది.

  • ఓం శ్రీ మహా గణాధిపతయే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details