Is Uttar Ramayan Authentic Or Not : ఎన్నో శతాబ్దాలుగా విద్వాంసులు, పండితులు ఉత్తర రామాయణ అంశంపై విశ్లేషణాత్మక చర్చలు జరుపుతూ వస్తున్నారు. సీతాదేవి భూమాతలో కలిసిపోవడం, కుశ-లవుల కథ వంటి భావోద్వేగ భరితమైన అంశాలు ఉత్తర కాండలో చూడవచ్చు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం దొరకడానికి నిర్దిష్టమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ముందు ఈ వివాదాస్పద అంశాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం.
మందరము పుస్తకంలో వాసుదాస స్వామి చేసిన వాదనలు!
రామాయణంపై వాసుదాస స్వామి చేసిన ప్రసిద్ధ రచన 'మందరము'. మందరము అంటే కల్పవృక్షం అని అర్థం. ఈ గ్రంథంలో ఉత్తర కాండ రామాయణంలో ఒక భాగమని వాసుదాస స్వామి తెలియజేశారు. తన వాదనను బలపరిచే క్రమంలో ఆయన 10 ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. అందులో అత్యంత బలమైనవిగా భావించే మూడు కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. మహర్షి వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు రాశారు. అందులో ప్రతి 1000 శ్లోకాల సముదాయం గాయత్రీ మంత్రంలోని ఒక్కో అక్షరంతో ప్రారంభమవుతుంది. ఉత్తర కాండను తీసేస్తే, రామాయణ శ్లోకాల సంఖ్య 24,000 కన్నా తగ్గిపోతుంది. ఈ అంశం ఆధారంగా ఉత్తరకాండ రామాయణంలో అంతర్భాగమేనని అనిపిస్తుంది.
- బాలకాండ 1.1.91 శ్లోకంలో మహర్షి నారదుడు రామరాజ్యాన్ని వర్ణిస్తూ, "రామరాజ్యంలో పుత్రులు ఎవరూ తమ తండ్రుల కన్నా ముందే మరణించరు" అని పేర్కొన్నారు. ఉత్తర కాండ రామరాజ్యం ఎంత సుభిక్షంగా ఉందో వివరిస్తూ ఈ అంశాన్ని నిర్ధారించినట్లుగా కనిపిస్తోంది. అందువల్ల రామాయణంలో ఉత్తరకాండ భాగమేనని సమర్ధిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
- బాలకాండ 1.3.38 శ్లోకంలో "వైదేహ్యాశ్చ విసర్జనం" అనగా సీతని త్యజించటం అనే వాక్యాన్ని పరిశీలిస్తే రాబోయే ఉత్తర కాండలో జరగబోయే సంఘటనను ముందుగానే ప్రస్తావించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మూడు అంశాలను విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం.
రామాయణానికి, గాయత్రీ మంత్రానికీ సంబంధం
నిజంగానే మహర్షి వాల్మీకి గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలను అనుసరించి 24,000 శ్లోకాలు రాశాడని అనుకుందాం. ఇది విశేషమైన కృషి అని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం గురించి ఎక్కడో ఒకచోట ప్రస్తావన ఉండాలి. కానీ మహర్షి వాల్మీకి రామాయణంలో కానీ, మరెక్కడా కానీ ఈ సంబంధాన్ని ప్రస్తావించలేదు. ఇది కేవలం కాకతాళీయమేనని స్పష్టం అవుతోంది. అనేక పండితులు వాల్మీకి రచించిన శ్లోకాలకు అదనంగా మూల రామాయణంలో అనేక శ్లోకాలు కాలక్రమేణా జోడించినట్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదనంగా జోడించిన శ్లోకాలను తీసివేస్తే, రామాయణంలో 24,000 శ్లోకాల కన్నా తక్కువే ఉంటాయి. ఇది గాయత్రి మంత్రంతో రామాయణ సంబంధాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.
నారదుడు చేసిన రామరాజ్య వర్ణన
బాలకాండ మొదటి సర్గ 90 నుంచి 97 శ్లోకాల్లో రామరాజ్యం గురించిన సంక్షిప్త వర్ణనలు ఉన్నాయి. ముఖ్యంగా 91 శ్లోకం రామరాజ్యంలో పుత్రమరణం జరగదని పేర్కొంది. ఈ అంశం ఆధారంగా ఉత్తర కాండలో రామరాజ్యంలోని పరిస్థితులను అంచనా వేశారని చెప్పటం కష్టం. వాస్తవానికి ఉత్తర కాండలోని 73 నుంచి 76 వరకు గల సర్గలని పరిశీలిస్తే రామరాజ్యంలో ఒక బ్రాహ్మణ బాలుడి మరణం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇది రామరాజ్యంలో జరగరాని ఘటన కాబట్టి బాలకాండలో ప్రస్తావించినట్లుగా పుత్రుల మరణం ఉండదన్న అంశం నిరాధారమవుతుంది. ఇది సంఘంలో మారుతున్న సామాజిక నైతికతకు ప్రతిస్పందనగా కనిపిస్తుంది. కాబట్టి దీని ఆధారంగా ఇవన్నీ తరువాతి కాలంలో జోడించిన అంశాలుగా పరిగణిస్తూ, ఉత్తరకాండ రామాయణం అంతర్భాగం కాదన్న అంశాన్ని బలపరుస్తోంది.
సంక్షిప్త రామాయణం పునరుక్తి
వాస్తవానికి బాలకాండలోని 3 వ సర్గలో 10 నుంచి 38 శ్లోకాలు నారదుని సంక్షిప్త రామాయణానికి పునర్వచనం, అంటే తిరిగీ చెప్పటం. ఒకవేళ ఇది ప్రామాణికం అయితే పద్య కావ్యంలో కానీ సాధారణ సాహిత్యంలో కానీ అది అనుచితంగా అనిపిస్తుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే బ్రహ్మ చెప్పిన సంక్షిప్త రామాయణంగా భావిస్తున్న 3వ సర్గలో 10 నుంచి 38 శ్లోకాలను తొలగించినా కథలో ఎలాంటి వ్యత్యాసం రాదు. అందుకే వీటిని తర్వాత కాలంలో జోడించి ఉండవచ్చనని, వీటి ఆధారంగా ఉత్తరకాండ రామాయణంలో అంతర్భాగం అనలేమనే వాదానికి ఊతమిస్తుంది.
సీతాదేవిని త్యాగం చేయటం గురించి ప్రస్తావన
ఇక మూడవ అంశాన్ని పరిశీలిస్తే "వైదేహ్యాశ్చ విసర్జనం" అనే పదం నారదుని సంక్షిప్త రామాయణంలో కనిపించదు కానీ బ్రహ్మదేవుడి పునర్వచనంలో కనిపిస్తుంది. పైగా మొత్తం ఉత్తర కాండను ఒక్క వాక్యంలో చెప్పడం ఏ మాత్రం సాధ్యమనే విషయాన్నీ కూడా విశ్లేషకులు పరిశీలించాలి. ఇది ఉత్తర కాండను న్యాయసమ్మతంగా చేయడానికి ఉద్దేశించిన అంశమని స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తరకాండ రామాయణం అంతర్భాగమా కాదా అనే వాదనను విశ్లేషించడానికి ఉపయోగపడే మరికొన్ని అంశాలను పరిశీలిద్దాం.
శ్రీరాముని పట్టాభిషేకంతో ముగిసిన రామాయణం
బాలకాండలోని 4వ సర్గలోని 1వ శ్లోకంలో వివరించిన ప్రకారం "ప్రాప్తరాజ్యస్య రామస్య" (తన రాజ్యాన్ని తిరిగి పొందిన రాముని) కథతో వాల్మీకి మహర్షి రామాయణ కథను అర్ధవంతంగా ముగించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే శ్రీరామునికి రాజ్యం లభించి పట్టాభిషేకం జరగడంతో రామాయణం ముగిసిపోవాలి. అంటే ఇక్కడ ఉత్తరకాండ లేదన్న అర్ధమే కదా వస్తుంది.
రావణ వధతోనే ముగిసే రామాయణం
బాలకాండలోని 4 వ సర్గలోని 7 వ శ్లోకంలో వాల్మీకి తాను రచించిన రామాయణానికి "రామాయణం", "సీతాయాశ్చరితం మహత్" "పౌలస్త్య వధ" అనే పేర్లను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రకారం చూసినా "పౌలస్త్య వధ" అంటే రావణ వధతో రామాయణానికి ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ ఉత్తరకాండ లేనట్లే కదా!