Kanuma pooja : సంక్రాంతి పండుగ నిర్వహించే మూడు రోజుల్లో ఆఖరిదైన కనుమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజున పలు పనులు, పూజలు చేయడం ద్వారా ఏడాది పొడవునా శుభాలు జరుగుతాయని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం. ధర్మానికి ప్రతిరూపమైన వృషభం అనుగ్రహం భక్తులు కనుమ వేళ పొందాలని కోరుకుంటారు. కనుమ రోజు ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
కనుమ పండుగను కనుము పులువు అని కూడా పిలుస్తారు. కనుము అంటే పశువు. పులువు అంటే గడ్డి. పశువులకు గడ్డి అందించే దినం కాబట్టి.. ఈ రోజును కనుమ పులువు అని పిలుస్తారు. అదే కాలక్రమంలో కనుమ రోజుగా మారింది. వ్యవసాయానికి ఆధారం పశువులే కాబట్టి.. ఆ రోజున పశువులను పూజించాలి.
సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపించడం, నమస్కరించడం, గోవు తోకకు ప్రణమిల్లి ఆశీర్వచనం తీసుకోవాలి.
"ఓం సురభ్యే నమ:" అనే మంత్రాన్ని చదువుతూ గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా గోపూజతోపాటుగా వృషభాన్ని కూడా పూజించాలి. కనుమ రోజు ఎద్దులకు చేసే పూజ, భక్తుల మనోభిష్టాలను సంపూర్ణంగా నెరవేరుస్తుందని మాచిరాజు చెబుతున్నారు.
ఉదయాన్నే ఎద్దులకు చక్కగా స్నానం చేయించి, పసుపు, కుంకమలతో అలంకరించి, మెడలో గంట కట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి చక్కగా పంట పొలాలకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ధర్మానికి ప్రతిరూపమైన వృషభాన్ని ఇలా పూజించడం ద్వారా ధర్మమార్గంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు.