తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆపదలు దరిచేరనీయని ఆంజనేయ స్వామి ఆరాధన! 'హనుమాన్ చాలీసా' ఎలా పుట్టిందో తెలుసా! - How Hanuman Chalisa Was Written - HOW HANUMAN CHALISA WAS WRITTEN

How Hanuman Chalisa Was Written : హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కార్యసిద్ధి, అభయం, విజయం చేకూరుతాయని విశ్వాసం. హనుమ ఆరాధనలో హనుమాన్ చాలీసా పారాయణకు విశిష్ట స్థానముంది. ముఖ్యంగా మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన ఎన్నో కఠిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పెద్దలు అంటారు. అసలు ఈ హనుమాన్ చాలీసాకు ఇంతటి ప్రాశస్త్యం ఎలా వచ్చింది? హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

How Hanuman Chalisa Was Written
How Hanuman Chalisa Was Written (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 3:34 AM IST

How Hanuman Chalisa Was Written :కార్యసిద్ధికి, శత్రుజయం కోసం ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. అయితే పరమ పవిత్రమైన హనుమాన్ చాలీసా ఎక్కడ పుట్టింది? ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనే వివరాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

వాస్తవ సంఘటన
ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ చాలీసాకు సంబంధించిన ఈ వాస్తవ సంఘటన గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇది 1600 AD సమయంలో అక్బర్ చక్రవర్తి కాలంలో జరిగిన సంఘటన. రామచరిత మానస్ వంటి అపురూపమైన గ్రంధాలను అనువదించిన రామభక్తుడు శ్రీ తులసీదాస్ గురించి తెలియని వారుండరు. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడ ఆయనను చూడటం కోసం జనం పోటెత్తేవారు. ఒకసారి తులసీదాస్ మథురకు వెళుతూ మార్గమధ్యంలో చీకటి పడే సరికి రాత్రి ఆగ్రాలో బస చేశాడు.

తులసీదాస్ దర్శనానికి ఎగబడ్డ జనం
తులసీదాస్ ఆగ్రాకు వచ్చారని ప్రజలకు తెలిసింది. ఇది విన్న జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు అక్బర్​కు ఈ విషయం తెలిసింది. సహజంగా రాజుకు ఉండే అతిశయంతో పాటు కొంత ఉత్సుకతతో ఇంత మంది చూడాలని ఆత్రుత పడుతున్న ఆ తులసీదాస్ ఎవరా! అని ఆరా తీసాడు.

బీర్బల్​ను వివరాలు అడిగిన అక్బర్
అక్బర్ చక్రవర్తి బీర్బల్‌ని ఈ తులసీదాసు ఎవరు అని అడుగగా, బీర్బల్ 'తులసీదాస్ గొప్ప రామభక్తుడు, ఈయన రామచరిత్ మానస్ అనువదించాడు. నేను కూడా ఇప్పుడే ఆయనను చూసి వస్తున్నాను' అని చెప్పగా విన్న అక్బర్​కు కూడా తులసీదాస్​ను చూడాలనిపించింది.

తులసీదాస్ దగ్గరకు భటులను పంపించిన అక్బర్
తాను గొప్ప రాజునన్న అతిశయంతో అక్బర్ తులసీదాస్​ను ఎర్రకోటకు హాజరుకావాలని చక్రవర్తి సందేశాన్ని సైనికులతో పంపించాడు.

అక్బర్ ఆహ్వానాన్ని నిరాకరించిన తులసీదాస్
సైనికులతో అక్బర్ పంపిన సందేశాన్ని విన్న తులసీదాస్ తాను శ్రీరామ భక్తుడునని, ఎర్రకోట వెళ్లి చక్రవర్తిని కలిసి తాను చేయాల్సింది ఏమి లేదని స్పష్టం చేస్తూ ఎర్రకోటకు వెళ్లడానికి నిరాకరించాడు.

అక్బర్ ఆగ్రహం
చక్రవర్తి అంతటి వాడు ఆహ్వానం పంపితే తులసీదాస్ నిరాకరించడం అక్బర్​కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే భటులను పంపి తులసీదాస్​ను గొలుసులతో బంధించి ఎర్రకోట తీసుకురావాలని ఆదేశించాడు.

బందీగా ఎర్రకోటకు తులసీదాస్
ఎర్రకోటకు బందీగా వచ్చిన తులసీదాస్​ను చూసి అక్బర్ 'మీ దగ్గర ఏవో మహిమలు ఉన్నాయని విన్నాను. నాకు కూడా ఆ మహిమలను చూపించండి' అనగా అందుకు తులసీదాస్ తాను కేవలం శ్రీరామ భక్తుడిని మాత్రమేనని, మహిమలు చూపించగల మాంత్రికుడను కాదని అన్నారు.

తులసీదాస్​కు కారాగారవాసం
తులసీదాస్ మాటలకూ ఆగ్రహించిన అక్బర్ అతనిని చెరసాలలో బంధించమని ఆజ్ఞాపించాడు.

ఎర్రకోటపై వానర సైన్యం దాడి
తులసీదాస్​ను బంధించిన రెండవ రోజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి. ఎర్రకోటలో ప్రజలందరూ భయ బ్రాంతులకు గురయ్యారు.

బీర్బల్​తో అక్బర్ సమావేశం
ఎర్రకోటపై వానర సైన్యం దాడి చేసిందన్న విషయం తెలుసుకున్న అక్బర్, బీర్బల్​ను పిలిచి ఏమి జరుగుతోందని అడుగగా, బీర్బల్ 'రాజా! మీరు తులసీదాస్ మహిమలు చూడాలనుకున్నారు కదా! అదే జరిగింది' అని చెప్పాడు.

తులసీదాస్​కు బంధవిముక్తి
అక్బర్ వెంటనే తులసీదాస్​ని చెరసాల నుంచి బయటకు రప్పించి సంకెళ్లు విడిపించాడు.

తులసీదాస్ బీర్బల్ సంభాషణ
బందిఖానా నుంచి విముక్తుడైన తులసీదాస్ బీర్బల్‌తో మాట్లాడుతూ తాను ఏ నేరం చేయకుండానే చెరసాల పాలయ్యానని, చెరసాలలో ఉన్న సమయంలో తాను శ్రీరాముని, హనుమంతుడిని ప్రార్థిస్తుండగా అనుకోకుండానే నా చేతులు వాటంతవే ఏవో శ్లోకాలు రాసుకున్నాయని, ఇవన్నీ హనుమకు అంకితమని అన్నాడు. అలాగే తాను వ్రాసిన 40 శ్లోకాలు తనను ఎలాగైతే కష్టం నుంచి బయట పడేసాయో, అలాగే ఎవరైనా ఆపదలు, కష్టాలు సంభవించినప్పుడు ఈ 40 శ్లోకాలు పారాయణ చేస్తే వారి బాధలు, కష్టాలు తీరిపోతాయని, ఈ శ్లోక సంపుటికి హనుమ చాలీసా అని పేరు పెట్టారు.

అక్బర్ పశ్చాత్తాపం
తొందరపాటుతో చక్రవర్తినన్న గర్వంతో తాను చేసిన పనికి అక్బర్ సిగ్గుపడి, తులసీదాస్​కు క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా అతనిని పూర్తి గౌరవం, రక్షణతో, మథురకు పంపాడు. అందుకే ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రతి ఒక్కరూ హనుమ అనుగ్రహంతో కష్టాల నుంచి బయట పడుతున్నారు.

జైశ్రీరామ్!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details