Gruhapravesam In August 2024 : సొంత ఇల్లు ప్రతీ ఒక్కరి జీవిత లక్ష్యాల్లో ఒకటి. అందుకే ఉద్యోగం, బిజినెస్, వివిధ పనులు చేసేవారు ఎవరైనా సరే.. పైసా పైసా కూడబెట్టి చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకుంటారు. అందుకే.. నిత్యం మన చుట్టూ ఇల్లు నిర్మితం అవుతూనే ఉంటాయి. ప్రతినెలా ప్రారంభోత్సవాలు అవుతూనే ఉంటాయి. అయితే.. కొన్ని రోజులుగా మూఢాలు ఉండడంతో.. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న చాలా మంది ఈ ఆగస్టు నెలలో గృహ ప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఇలా.. ఈ మాసంలో గృహ ప్రవేశం చేసుకోవాలనుకునే వారికి ప్రముఖ జ్యోతిష, వాస్తు ముహూర్త నిపుణులు 'నిట్టల ఫణి భాస్కర్' కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఎంతో కష్టపడి ఇంటిని నిర్మించుకున్న వారు సరైన మూహూర్త సమయంలో గృహ ప్రవేశం చేస్తేనే.. ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు.. ఈ శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలకు బలమైన మూహుర్తాలు లేవని ఫణి భాస్కర్ చెబుతున్నారు.
"ఈ ఆగస్టు నెలలో గృహ ప్రవేశం చేయడానికి యోగ్యమైన మూహూర్తం ఏది లేదు. అయితే, మెజార్టీ పంచాంగం సర్క్యులేషన్ ఉన్నవారు మిథున, మేష, తుల లగ్నానికి ఇచ్చారు. ఈ శ్రావణ మాసంలో ఆయా లగ్నాలకి గృహ ప్రవేశం చేయడం వల్ల చాలా అనర్థాలు సంభవిస్తాయి. ముహూర్తానికి చాలా బలం ఉండాలి. కాబట్టి, ఇటువంటి లగ్నాల్లో గృహ ప్రవేశం చేయడం కంటే.. అక్టోబర్, నవంబర్ నెలల్లో గృహ ప్రవేశం చేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలి అనుకుంటే.. కొన్ని మూహుర్తాలున్నాయి కానీ, యోగ్యమైన ముహుర్తాలు ఏవి లేవు." - నిట్టల ఫణి భాస్కర్, వాస్తు ముహూర్త నిపుణులు
ఇక వివాహానికి సంబంధించి ఈ ఆగస్టు నెల కొంత అనుకూలంగా ఉందని ఫణి భాస్కర్ చెబుతున్నారు. గత మూడు నెలలుగా మూహుర్తాలు లేవు కాబట్టి, ఈ నెలలో పెళ్లిల్లు ఎక్కువగా జరుగుతాయని అంటున్నారు. ఇతర శుభాకార్యాల సంగతి ఎలా ఉన్నా.. గృహ ప్రవేశం విషయంలో మాత్రం ఈ నెల అనుకూలంగా లేదని చెబుతున్నారు.