Govardhan Puja Significance : ద్వాపరయుగంలో ప్రారంభమైన ఈ గోవర్ధన పూజ అంతకు ముందు ఇంద్ర యాగంగా జరుపుకునేవారు. అసలు ఇంద్రయాగం గోవర్ధన పూజగా ఎలా మారింది? గోవర్ధన పూజ అంటే ఏమిటి? ఈ పూజ ఎలా జరుపుకుంటారు? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గోవర్ధన పూజ రైతుల పండుగ
కార్తీకమాసంలో ఆరంభంలో నిర్వహించే గోవర్ధన పూజ ద్వాపరయుగంలో ఇంద్రయాగంగా జరుపుకునేవారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పుదిక్పాలుడు. వర్షకారకుడు. వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. అందుకే ఈ పండుగనాడు ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఈ పండుగనాడు పలురకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్న పురాశులు గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునకు నివేదనగా సమర్పిస్తారు. అందుకే ఈపూజకు అన్నకూటం అని మరొక పేరు కూడా ఉంది.
గోవర్ధన పూజ వెనుక పౌరాణిక గాథ
ఇంద్రుని గర్వం
శ్రీకృష్ణుడు శ్రీమహావిష్ణువు అవతారమని ఇంద్రునకు తెలిసినా, కృష్ణుడు మానవుడుగా జన్మించాడు కాబట్టి శ్రీకృష్ణుడు కూడా తనను పూజించాలని ఇంద్రుడు భావించాడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు, ఇంద్రుని గర్వం అణచాలని సంకల్పించాడు.
ఇంద్రుని పూజించ వద్దన్న కృష్ణుడు
ఇంద్రయాగం చేసేరోజు రానే వచ్చింది. గోకులంలోని వారంతా ఇంద్రుని పూజించడానికి సర్వం సిద్ధం చేసారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి, గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ ఈ రోజు నుంచి ఇంద్రుని పూజించడం మానేయండి. మనందకీ పంటలు మనపశువులకు మేత ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతమే కనుక నేటినుంచి ఈ పర్వతాన్నే పూజిద్దాం అన్నాడు.
కృష్ణుని మాటను పాటించిన గోకులం
గోకులంలో వారికి శ్రీకృష్ణుని మాటంటే వేదం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాలలో, ఎందరో రాక్షసుల బారి నుంచి గోకులవాసులను కాపాడాడు. అందుచేత గోకుల ప్రజలంతా శ్రీకృష్ణుని మాట గౌరవించి ఇంద్రుని పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు.
గోకులంపై రాళ్లవాన కురిపించిన ఇంద్రుడు
శ్రీకృష్ణుని మాట మేరకు గోకులంలో ప్రజలు ఇంద్రుని పూజించడంమాని గోవర్ధన పర్వతాన్ని పూజిస్తున్నారన్న సంగతి నారదుని ద్వారా తెలుసుకున్న ఇంద్రుడు కోపగించి గోకులంమీద రాళ్ళతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. గోకుల వాసులంతా శ్రీకృష్ణుని శరణు కోరారు.