Zaheerabad MP Seat Winning Chances 2024: జహీరాబాద్ లోక్‌సభ స్థానంపై ప్రధాన రాజకీయ పార్టీలు గురిపెట్టాయి. 1952లో జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కాగా ఈ ప్రాంతం కొంత కాలం మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలో సాగింది. దేశవ్యాప్తంగా జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో జహీరాబాద్ కేంద్రంగా లోక్‌సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్‌తో పాటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు చేరాయి.
Zaheerabad MP Seat History :జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో 16,33,786 మంది ఓటర్లు(Zaheerabad Lok Sabha Voters) ఉండగా వీరిలో కన్నడ, మరాఠీ భాష మాట్లాడేవారు సుమారు 4 లక్షల మంది ఉన్నారు. జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలోని న్యాల్‌కల్, జహీరాబాద్ మండలాలు, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మనూరు, కంగ్టి, నాగిల్‌గిద్ద మండలాల్లోని ఎక్కువ మంది ప్రజలు నిత్యం కన్నడ భాష మాట్లాడుతారు.
జుక్కల్ నియోజకవర్గంలోని అత్యధిక మంది మరాఠీకి ప్రాధాన్యత ఇస్తారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మూడు సార్లు ఎన్నికలు జరగాయి. మొదటి సారి కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, ఆ తర్వాత 2014, 2019లో ఎన్నికల్లో బీబీపాటిల్ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల పార్టీకు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు.
Zaheerabad MP Candidates 2024 : జహీరాబాద్ మొదటి ఎంపీ నారాయణఖేడ్(MP Narayankhed)కు చెందిన సురేష్ షెట్కార్ కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడగలరు. జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం సిర్పూర్‌కు చెందిన బీబీపాటిల్ తెలుగుతో పాటు మరాఠీ, కన్నడలో మాట్లాడగలరు. బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కేవలం తెలుగులో మాత్రమే మాట్లాడగలగటంతో ఇతర భాషా ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేయగలరో వేచిచూడాల్సి ఉంది.